Sugar Import: దేశంలో పండుగల సీజన్ దగ్గరపడుతున్న వేళ చక్కెర ధరలు చుక్కలనంటుతున్నాయి. మార్చి 2026 నుంచి నిరంతరం పెరుగుతున్న ధరలు సామాన్యుడి పాకెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మహారాష్ట్రలోని షుగర్ మిల్లుల్లో ఎక్స్-మిల్ ధర క్వింటాల్‌కి ఏకంగా రూ.5,400 నాజూకుగా రూ.5,560కి చేరింది. ఈ అడ్డూ అదుపూ లేని ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి సుమారు 10 లక్షల టన్నుల పంచదారను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. గతంలో 2016-17 సీజన్లో చివరిసారిగా భారత్ విదేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకుంది.

దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?

దేశంలో ఉత్పత్తి కంటే వినియోగం విపరీతంగా పెరిగిపోవడమే ఈ కొరతకు ప్రధాన కారణం. అక్టోబర్ 2025లో ప్రారంభమైన ప్రస్తుత సీజన్లో మిల్లుల వద్ద నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి తోడు ప్రారంభంలో ప్రభుత్వం అంచనాల ఆధారంగా 20 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. ఎగుమతులపై ఆంక్షలు విధించే నాటికే దాదాపు 8 లక్షల టన్నుల పంచదార దేశం దాటిపోయింది. ఇప్పుడు దేశీయంగా ఏర్పడిన కొరతను భర్తీ చేయడానికి దాదాపు అదే పరిమాణంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

పరిశ్రమలో నిల్వల కొరత

మార్చి 2026 నుంచి చక్కెర సరఫరాలో ఇబ్బందులు వస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. నెలా నెలా మార్కెట్‌లోకి విడుదల చేయాల్సిన కోటాను అందించడంలో పలు మిల్లులు చేతులెత్తేశాయి. నిపుణుల అంచనాల ప్రకారం ఈ సీజన్లో ఇథనాల్ తయారీకి వాడినది పోను నికరంగా 2.79 కోట్ల టన్నుల చక్కెర ఉత్పత్తి జరిగింది. పాత నిల్వలు 47 లక్షల టన్నులతో కలిపి మొత్తం లభ్యత 3.26 కోట్ల టన్నులుగా ఉంది. దేశీయ వినియోగం 2.8 కోట్ల టన్నులు కాగా, ఎగుమతులు పోను మిగిలిన నిల్వలు కేవలం 35 నుంచి 39 లక్షల టన్నులకు పడిపోయాయి. సాధారణంగా రాబోయే అవసరాల కోసం కనీసం 60 లక్షల టన్నుల నిల్వలు ఉండాలి.

ధరలు ఏమేరకు తగ్గుతాయి?

దిగుమతుల వార్త వినగానే అంతర్జాతీయ మార్కెట్లోనూ మార్పులు ప్రారంభమయ్యాయి. న్యూయార్క్ మార్కెట్లో కచ్చా చక్కెర ధర పౌండుకి 17.47 సెంట్లకు చేరి 14 నెలల గరిష్టాన్ని తాకింది. అయితే విదేశాల నుంచి 10 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నా మార్కెట్‌లో ధరలు ఊహించినంత భారీగా ఏమీ పడిపోవని విశ్లేషకులు చెబుతున్నారు. క్వింటాలుపై గరిష్టంగా రూ.500 వరకు మాత్రమే ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.4,200 నుంచి రూ.4,300 వరకు ఉండటంతో మిల్లులకు కూడా పెద్దగా నష్టం ఉండబోదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story