India Remittance : విదేశాల్లో స్థిరపడి, భారత్ గర్వపడేలా చేస్తున్న ప్రవాస భారతీయులు మరోసారి తమ సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా సొంత దేశానికి డబ్బు పంపడంలో భారత్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 ప్రకారం.. భారత్ ఏకంగా 137 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ (విదేశాల నుంచి వచ్చే నగదు) అందుకుని రికార్డు సృష్టించింది. 100 బిలియన్ డాలర్ల మార్కును దాటిన ప్రపంచంలోని ఏకైక దేశంగా భారత్ చరిత్రకెక్కింది.

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. 2010 నుంచి భారత్ ఈ జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 2010లో 53.48 బిలియన్ డాలర్లుగా ఉన్న రెమిటెన్స్, 2015 నాటికి 68.91 బిలియన్లకు, 2020 నాటికి 83.15 బిలియన్లకు పెరిగింది. ఇప్పుడు 2024-2026 మధ్య కాలంలో ఇది ఏకంగా 137.67 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్ తర్వాత మెక్సికో, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్ దేశాలు నిలిచాయి. దక్షిణ ఆసియాలో రెమిటెన్స్ వృద్ధి రేటు 11.8 శాతంగా ఉండగా, అందులో సింహభాగం భారత్‌దే కావడం విశేషం.

ఎక్కడి నుంచి ఎక్కువ డబ్బు వస్తోంది?

విదేశాలకు నిధులను పంపడంలో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. 2024లో అమెరికా నుంచి సుమారు 100 బిలియన్ డాలర్ల నిధులు బయటి దేశాలకు వెళ్లాయి. దీని తర్వాత సౌదీ అరేబియా (46 బిలియన్ డాలర్లు), స్విట్జర్లాండ్ (40 బిలియన్ డాలర్లు), జర్మనీ (24 బిలియన్ డాలర్లు) నిలిచాయి. సంపన్న దేశాల నుంచి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ నిధులు ఎక్కువగా మళ్లుతున్నాయి.

విద్యార్థుల వలసలోనూ రెండో స్థానం

అంతర్జాతీయ స్థాయిలో చదువుకోవడానికి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో ఆసియా దేశాల వాటానే ఎక్కువగా ఉంది. చైనా నుంచి అత్యధికంగా 10 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లగా, 6.20 లక్షల మంది విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్, వియత్నాం వంటి దేశాలు భారత్ కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. విదేశీ విద్యార్థులలో సగానికి పైగా యూరప్ మరియు ఉత్తర అమెరికా దేశాలలోనే నివసిస్తున్నారు.

బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్ వైపు

భారతదేశానికి చెందిన మేధావులు విదేశాలకు వెళ్లిపోవడాన్ని (బ్రెయిన్ డ్రెయిన్) అరికట్టి, వారి మేధస్సును తిరిగి దేశాభివృద్ధికి వాడుకోవడానికి (బ్రెయిన్ గెయిన్) ప్రభుత్వం కృషి చేస్తోందని నివేదిక పేర్కొంది. భారతీయ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు తిరిగి దేశానికి వచ్చి స్టార్టప్‌లను ప్రారంభించడానికి లేదా ఇక్కడి కంపెనీలకు సలహాలు ఇవ్వడానికి ప్రవాసి భారతీయ దివస్ వంటి వేదికలు తోడ్పడుతున్నాయి. చైనా కూడా థౌజండ్ టాలెంట్స్ ప్లాన్ ద్వారా విదేశీ మేధావులను వెనక్కి రప్పిస్తోంది. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారత్ టెక్నాలజీ రంగంలో మరింత వేగంగా అభివృద్ధి చెందుతోందని యూఎన్ కీర్తించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story