India UK Deal : భారతదేశం, బ్రిటన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తున్న వాణిజ్య చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక సామాజిక భద్రతా ఒప్పందం, సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం(CETA) ఈ ఏడాది జూలై 15 నుంచి అధికారికంగా అమలులోకి రాబోతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ చారిత్రాత్మక అడుగుతో బ్రిటన్ లో స్థిరపడిన, లేదా తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న దాదాపు 90 నుంచి 95 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులకు విపరీతమైన ప్రయోజనం కలగడమే కాకుండా, అక్కడ కంపెనీల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గనున్నాయి.

డబుల్ ట్యాక్స్ బాదుడుకు శాశ్వతంగా బ్రేక్

ప్రస్తుతం బ్రిటన్ లో పని చేస్తున్న భారతీయులకు ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. వారు భారతదేశంలో పీఎఫ్, సోషల్ సెక్యూరిటీ కడుతున్నప్పటికీ.. బ్రిటన్ లోనూ వారి జీతం నుంచి సోషల్ సెక్యూరిటీ కింద దాదాపు 15 శాతం డబ్బు కట్ అవుతోంది. పైగా బ్రిటన్ లో ఈ సామాజిక భద్రత ప్రయోజనాలు పొందాలంటే కనీసం 10 ఏళ్లు అక్కడ సర్వీస్ చేయాలి. అయితే తాత్కాలికంగా 2-3 ఏళ్ల కోసం లండన్ వెళ్లే మన ఐటీ ఉద్యోగులకు ఈ డబ్బు తిరిగి వచ్చేది కాదు. దీనివల్ల ఏటా మన ప్రొఫెషనల్స్ దాదాపు 50 కోట్ల డాలర్లను బ్రిటన్ ప్రభుత్వ వ్యవస్థలోనే వదిలేయాల్సి వచ్చేది. కొత్త ఒప్పందం ప్రకారం.. ఇండియాలో సోషల్ సెక్యూరిటీ కట్టే ఉద్యోగులు, బ్రిటన్ లో గరిష్టంగా ఐదేళ్ల వరకు ఆ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీనికోసం కేవలం కవరేజ్ సర్టిఫికెట్ సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది.

భారత ఐటీ దిగ్గజాలకు దక్కనున్న భారీ ఆర్థిక ఊరట

ఈ కొత్త నిబంధనల వల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలకు భారీగా ఖర్చులు కలిసిరానున్నాయి. ప్రస్తుతం బ్రిటన్ లో దాదాపు 900కు పైగా భారతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అలాగే దాదాపు 75,000 మంది భారతీయ ఐటీ నిపుణులు అక్కడ సేవలందిస్తున్నారు. బ్రిటన్ లో మన ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 40,000 నుంచి 50,000 పౌండ్ల (సుమారు రూ.40 నుంచి 50 లక్షలు) వరకు ఉంటుంది. ఇప్పుడు కంపెనీలు చెల్లించాల్సిన సోషల్ సెక్యూరిటీ వాటా మినహాయింపు లభించడంతో, బ్రిటన్ మార్కెట్లో ఇతర విదేశీ కంపెనీలతో పోటీ పడటానికి మన దేశీ ఐటీ సేవల రంగానికి మరింత బలం చేకూరనుంది.

భారత ఐటీ రంగానికి బ్రిటన్ ఎందుకు అంత ముఖ్యం?

ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న 283 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.23 లక్షల కోట్లు) ఐటీ పరిశ్రమ ఎగుమతులలో బ్రిటన్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. అమెరికా తర్వాత భారత్ కు బ్రిటనే రెండవ అతిపెద్ద ఐటీ ఎగుమతుల మార్కెట్. మన దేశం చేసే మొత్తం ఐటీ ఎగుమతులలో బ్రిటన్ వాటానే దాదాపు 17 శాతంగా ఉంది. గడిచిన 2024వ సంవత్సరపు గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశం నుంచి బ్రిటన్ కు జరిగిన సేవల ఎగుమతుల విలువ ఏకంగా 21.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో బ్రిటన్ నుంచి భారత్ చేసుకున్న దిగుమతులు కేవలం 13.7 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే వాణిజ్య పరంగా బ్రిటన్ పై భారత్ పూర్తి ఆధిక్యంలో ఉందనడానికి ఈ నంబర్లే నిదర్శనం. జూలై 15 నుంచి అమల్లోకి రాబోయే ఈ సరికొత్త రూల్స్ తో ఇరు దేశాల మధ్య వ్యాపార బంధం మరింత బలోపేతం కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story