India-UK FTA : ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. రైతులకు గుడ్ న్యూస్
రైతులకు గుడ్ న్యూస్

India-UK FTA : ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ఒక ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రక ఒప్పందం వల్ల భారతదేశం, బ్రిటన్ మధ్య వాణిజ్యం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 99% భారతీయ ఉత్పత్తులపై బ్రిటన్ జీరో ట్యాక్స్ విధిస్తుంది. అలాగే, 90% బ్రిటన్ ఉత్పత్తులకు భారతదేశం కూడా ట్యాక్స్ గణనీయంగా తగ్గించింది. దీంతో కొల్హాపురి చెప్పులు, బెనారస్ చీరలు, మైసూర్ సిల్క్ చీరలు వంటి వివిధ ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్లోకి సులభంగా ప్రవేశం లభిస్తుంది. ఈ చిన్న తరహా పరిశ్రమలలో మహిళలు ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి, భారతదేశంలోని మహిళా శక్తి మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
భారతదేశం, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతీయ రైతులకు గొప్ప వరం. 95% వ్యవసాయ ఉత్పత్తులకు బ్రిటన్ ఎలాంటి సుంకం లేకుండా ప్రవేశం కల్పించింది. పసుపు, మిరియాలు, యాలకులు, ఊరగాయలు, పప్పుధాన్యాలు వంటి ఆహార ఉత్పత్తులకు సుంకం లేని ప్రవేశం లభించింది. పండ్లు, కూరగాయలకు కూడా సున్నా సుంకం వర్తిస్తుంది.
సుంకం లేకుండా ఎగుమతులు చేయడం వల్ల బ్రిటన్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. భారతదేశం మొత్తం వ్యవసాయ ఎగుమతులు సంవత్సరానికి 36.63 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బ్రిటన్ దేశం వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు 37.52 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇందులో భారతదేశం నుండి సరఫరా అవుతున్న ఆహార ఉత్పత్తుల విలువ కేవలం 811 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇప్పుడు భారతీయ వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకం లేకపోవడం వల్ల భారతదేశం నుండి ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే మూడు సంవత్సరాల్లో బ్రిటన్‌కు భారతదేశం వ్యవసాయ ఎగుమతులు 20శాతం పెరుగుతాయని అంచనా.
భారతదేశంలో మొత్తం జనాభాలో 44% మంది వ్యవసాయ రంగంలోనే ఉన్నారు కాబట్టి, ఈ ఒప్పందం వల్ల చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభం చేకూరుతుంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుంది.
