India-UK Trade Deal : భారతదేశం, బ్రిటన్ మధ్య వ్యాపార, దౌత్య సంబంధాలలో ఒక సువర్ణ అధ్యాయం మొదలుకానుంది. వచ్చే జూలై 15, 2026 నుంచి ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం(CETA) అధికారికంగా అమల్లోకి రాబోతోంది. దీనితో పాటే ఇరు దేశాల ఉద్యోగుల సామాజిక భద్రతకు సంబంధించిన డీసీసీ అగ్రిమెంట్ కూడా అదే రోజు నుంచి అమలు కానుంది. ఈ చారిత్రాత్మక అడుగుతో భారతీయ ఎగుమతిదారులకు లండన్ మార్కెట్లలో తిరుగులేని అవకాశాలు లభించనున్నాయి.

భారతీయ వస్తువులపై పన్నులు పూర్తిగా రద్దు

ఈ సరికొత్త ఒప్పందం ప్రకారం బ్రిటన్ దేశానికి ఎగుమతి అయ్యే దాదాపు 99 శాతం భారతీయ ఉత్పత్తులపై ఇప్పటివరకు ఉన్న దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు కానున్నాయి. ఇది మన దేశీయ తయారీ రంగానికి (మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్) ఒక పెద్ద బూస్టర్ డోస్ లాంటిది. ఇప్పటిదాకా బ్రిటన్‌లో భారతీయ వస్తువులపై భారీగా పన్నులు వసూలు చేసేవారు. తాజా ఒప్పందంతో ఆ పన్నులన్నీ సున్నా శాతానికి పడిపోనున్నాయి.

ఏయే వస్తువులపై ఎంత టాక్స్ తగ్గుతుందంటే?

ఇప్పటివరకు బ్రిటన్ మార్కెట్లో మన దేశ ప్రాసెస్డ్ ఫుడ్ పై ఏకంగా 70 శాతం వరకు భారీ టాక్స్ ఉండేది. అలాగే సముద్ర ఆహార ఉత్పత్తులపై 21.5 శాతం, ఇంజనీరింగ్ ఆటోమొబైల్ పార్ట్స్‌పై 18 శాతం, తోలు వస్తువులు, లెదర్ గూడ్స్ పై 16 శాతం, దుస్తులపై 12 శాతం వరకు ఉన్న పన్నులు ఇకపై పూర్తిగా క్లియర్ అయిపోతాయి. దీనివల్ల మన దేశంలోని చిన్న పరిశ్రమలు, చేతివృత్తుల వారు, రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులు బ్రిటన్‌లో చాలా తక్కువ ధరకే లభిస్తాయి. అయితే మన దేశంలోని డైరీ ప్రొడక్ట్స్, తృణధాన్యాలు, ఆపిల్స్ వంటి సున్నితమైన వ్యవసాయ రంగాలకు విదేశీ పోటీ నుండి పూర్తి రక్షణ కల్పించారు.

ఐటీ ప్రొఫెషనల్స్, సర్వీస్ రంగానికి లండన్ లాటరీ

కేవలం వస్తువుల అమ్మకాలే కాకుండా సేవా రంగంలో కూడా ఈ ఒప్పందం ఒక గేమ్ చేంజర్ కానుంది. ఐటీ, ఎడ్యుకేషన్, టెలికాం, ప్రొఫెషనల్ సర్వీసెస్, హెల్త్‌కేర్ వంటి భారత్‌కు పట్టున్న 137 సేవా రంగాలలో వ్యాపారాలు చేయడానికి బ్రిటన్ పూర్తి అనుమతులు ఇచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా, తాత్కాలిక ప్రాతిపదికన బ్రిటన్ వెళ్లే భారతీయ ఐటీ ఉద్యోగులకు అక్కడ విధించే డబుల్ టాక్స్ నుంచి మినహాయింపు పరిమితిని 3 సంవత్సరాల నుంచి ఏకంగా 5 సంవత్సరాలకు పెంచారు. దీనివల్ల 75 వేల మందికి పైగా ఉద్యోగులకు, దాదాపు 900 కి పైగా ఇండియన్ కంపెనీలకు భారీగా డబ్బు ఆదా అవుతుంది.

షేఫ్‌లు, యోగా మాస్టర్లకు ప్రత్యేక వీసాలు

మన సాంప్రదాయ కళలు, ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చేలా ఈ ఒప్పందంలో ఒక ప్రత్యేకమైన కోటాను కేటాయించారు. దీని ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశానికి చెందిన 1,800 మంది నిపుణులైన వంట మాస్టర్లు (ఇండియన్ షేఫ్స్), యోగా శిక్షకులు, క్లాసికల్ మ్యూజిషియన్లకు (శాస్త్రీయ సంగీత విద్వాంసులు) బ్రిటన్ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివసించడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రత్యేక వీసా సదుపాయాన్ని కల్పించనున్నారు.

స్టీల్ పరిశ్రమకు గట్టి రక్షణ కవచం

మొత్తం 30 అధ్యాయాలతో రూపొందించిన ఈ భారీ అంతర్జాతీయ ఒప్పందంలో భారత ప్రభుత్వం మన దేశీయ ఉక్కు పరిశ్రమల ప్రయోజనాలను పూర్తిగా కాపాడింది. జూలై 1, 2026 నుంచి బ్రిటన్ ప్రభుత్వం స్టీల్ ఎగుమతులపై తీసుకువస్తున్న సరికొత్త కఠిన నిబంధనల నుంచి భారతదేశానికి చెందిన 85 శాతం స్టీల్ వ్యాపారానికి పూర్తి మినహాయింపు లభించింది. మిగిలిన 15 శాతం స్టీల్‌ను కూడా ఒక ప్రత్యేక కోటా సిస్టమ్ ద్వారా సురక్షితంగా ఉంచారు.

సామాన్యుడి నుంచి స్టార్టప్స్ దాకా అందరికీ లాభం

ఈ మెగా ట్రేడ్ డీల్ కేవలం కార్పొరేట్ కంపెనీల కోసమే కాకుండా.. దేశంలోని యువత, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎమ్ఈ రంగానికి గ్లోబల్ మార్కెట్ తలుపులు తెరుస్తుంది. మే 2021 లో ఇరు దేశాల మధ్య ప్రారంభమైన ఈ చర్చలు.. ఏకంగా 14 రౌండ్ల పాటు సుదీర్ఘంగా సాగి ఎట్టకేలకు క్లియర్ అయ్యాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారతదేశంలో భారీగా కొత్త ఉద్యోగాలు రావడంతో పాటు.. గ్లోబల్ ఎకానమీలో భారత్ ఒక తిరుగులేని సూపర్ పవర్‌గా ఎదగడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story