Unemployment Rate: దేశంలో తగ్గుముఖం పట్టిన నిరుద్యోగిత రేటు.. తాజా గణాంకాలు ఇవే
తాజా గణాంకాలు ఇవే

Unemployment Rate: దేశ ఉపాధి రంగంలో సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(PLFS) తాజా నివేదిక ప్రకారం అక్టోబర్ 2026లో దేశ నిరుద్యోగిత రేటు 4.9 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ నెలలో ఇది 5 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం అంటే అక్టోబర్ 2025లో ఉన్న 5.2 శాతంతో పోలిస్తే నిరుద్యోగం 0.3 శాతం తగ్గడం విశేషం. 15 ఏళ్లు ఆపైబడిన వయసు ఉన్న వారిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నగరాల్లో తగ్గిన నిరుద్యోగం
పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పుంజుకోవడంతో అక్టోబర్ నెలలో పట్టణ నిరుద్యోగిత రేటు 6.7 శాతానికి దిగివచ్చింది. అంతకుముందు సెప్టెంబర్ నెలలో ఇది 6.9 శాతంగా ఉండేది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు ఎలాంటి మార్పు లేకుండా 4.2 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మొత్తం జనాభాలో పని చేస్తున్న లేదా పని కోసం సిద్ధంగా ఉన్న వారి నిష్పత్తిని తెలిపే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు(LFPR) సెప్టెంబర్‌లో 55.5 శాతం ఉండగా, అక్టోబర్ నాటికి 55.7 శాతానికి పెరిగింది. అలాగే వర్కర్-పాపులేషన్ రేషియో కూడా 52.7 శాతం నుంచి 53 శాతానికి చేరుకుంది.
వర్క్‌ఫోర్స్‌లో దూసుకుపోతున్న మహిళలు
ఈ నివేదికలో అత్యంత ఆశాజనకమైన అంశం మహిళల భాగస్వామ్యం పెరగడం. దేశవ్యాప్తంగా మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు సెప్టెంబర్‌లో ఉన్న 34.6 శాతం నుంచి అక్టోబర్‌లో 35 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భాగస్వామ్యం 38.9 శాతం నుంచి 39.5 శాతానికి పెరగగా, పట్టణాల్లో 25.9 శాతం వద్ద స్థిరంగా ఉంది. అంతేకాకుండా మహిళల్లో నిరుద్యోగిత రేటు 5.2 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగం 3.8 శాతానికి పడిపోవడం 2026 సంవత్సరంలోనే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.
మూడు లక్షల మంది అభిప్రాయాలతో సర్వే
జాతీయ గణాంక కార్యాలయం (NSO) అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఈ మాసిక సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2,11,474 మంది, పట్టణ ప్రాంతాల్లో 1,59,001 మంది చొప్పున మొత్తం 3,70,475 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలను రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉపాధి పెరగడం, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం దేశ ఉపాధి రంగానికి బలమైన ఊతాన్ని ఇస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

