Unemployment Rate: ఉపాధి రంగంలో శుభవార్త.. 5.1 శాతానికి పడిపోయిన భారత్ నిరుద్యోగ రేటు!
భారత్ నిరుద్యోగ రేటు!

Unemployment Rate: దేశంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఉపాధి రంగం నుంచి ఊరటనిచ్చే వార్త వెలువడింది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగ రేటు 5.1 శాతానికి పడిపోయింది. అంతకుముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5.4 శాతంగా నమోదైన ఈ రేటు ప్రస్తుత త్రైమాసికంలో స్వల్పంగా మెరుగైంది. గత ఏడాదితో పోలిస్తే ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ఈ సానుకూల ఫలితం లభించింది.
గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఉపాధి అవకాశాలు
తాజా నివేదిక ప్రకారం నిరుద్యోగం తగ్గడంలో గ్రామీణ భారత్ కీలక పాత్ర పోషించింది. గ్రామీణ నిరుద్యోగ రేటు గత త్రైమాసికంలో ఉన్న 4.8 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గిపోవడం విశేషం. గ్రామీణ పురుషుల నిరుద్యోగ రేటు 4.4 శాతానికి పడిపోయింది. అయితే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 6.7 శాతం నుంచి 6.8 శాతానికి స్వల్పంగా పెరిగినప్పటికీ మొత్తంగా పరిస్థితి స్థిరంగానే ఉందని నివేదిక పేర్కొంది.
కార్మిక శక్తిలో పెరిగిన మహిళల భాగస్వామ్యం
ఈ సర్వేలో అత్యంత కీలకమైన అంశం మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం పెరగడం. ఉద్యోగాలు లేదా సొంత వ్యాపారాల్లో మహిళల భాగస్వామ్యం 33.2 శాతం నుంచి 34.7 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా మొత్తం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య ఏకంగా 57.9 కోట్ల మార్కుకు చేరుకుంది. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారడం, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అవకాశాలు లభించడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
స్వయం ఉపాధి రంగానికి పెద్దపీట
గ్రామీణ ప్రాంతాల్లో సొంత వ్యాపారాలు లేదా స్వయం ఉపాధిలో నిమగ్నమైన పనివారల వాటా 61.4 శాతం నుంచి 62.7 శాతానికి పెరిగింది. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో క్రమబద్ధమైన జీతం పొందే ఉద్యోగుల సంఖ్య 49.6 శాతానికి చేరింది. రోజువారీ వేతన కార్మికుల శాతం మాత్రం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ స్వల్పంగా తగ్గింది. స్వయం ఉపాధి వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపడం వల్ల ఈ రకమైన మార్పులు కనిపిస్తున్నాయి.
సర్వే పద్ధతుల్లో మార్పులు
కార్మిక శక్తి సూచికలను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి 2025 జనవరి నుంచి సర్వే పద్ధతిలో మార్పులు చేశారు. అందులో భాగంగా చేపట్టిన ఆరో త్రైమాసిక బులెటిన్ ఇది. దేశవ్యాప్తంగా 5,55,593 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలు రూపొందించారు. నిరుద్యోగ రేటు తగ్గడం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

