India-US Trade Deal : మేక్ ఇన్ ఇండియాకు అమెరికా బూస్ట్..ఐటీ, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాల జాతర
ఐటీ, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాల జాతర

India-US Trade Deal : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చారిత్రాత్మక చర్చలు ఫలించాయి. ఇరు దేశాల మధ్య నెలల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ సోమవారం భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా అగ్రరాజ్యం భారత్‌పై ఉన్న టారిఫ్‌లను భారీగా తగ్గించడమే కాకుండా, వివాదాస్పదంగా మారిన రష్యా చమురు పెనాల్టీలను కూడా ఎత్తివేసింది. అయితే, ఈ డీల్‌లో మన దేశ వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని ఎలా కాపాడుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
భారత దౌత్య చరిత్రలో ఇదొక గొప్ప విజయంగా చెప్పవచ్చు. అమెరికా విధించిన 25 శాతం రెసిప్రోకల్ టారిఫ్‌ను ఇప్పుడు 18 శాతానికి తగ్గించడం వల్ల భారత ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్‌లో మరింత బలోపేతం కానున్నారు. దీనికి తోడు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధిస్తున్న 25 శాతం పెనాల్టీ డ్యూటీని కూడా ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల మన దేశ ఖజానాకు వేల కోట్లు ఆదా కావడమే కాకుండా, పెట్రోల్, డీజిల్ ధరలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. మన దేశంలోని కోట్లాది మంది రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడటం. అమెరికా నుంచి చౌకగా వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తుల వల్ల మన దేశీయ మార్కెట్ దెబ్బతినకుండా ఆయా రంగాలను ఈ డీల్ నుంచి పూర్తిగా మినహాయించారు. అంటే, భారత్ అమెరికా నుంచి టెక్నాలజీ, ఎనర్జీ వంటి రంగాల్లో దిగుమతులు పెంచుకుంటుంది కానీ, మన అన్నదాతను దెబ్బతీసే అగ్రి ఉత్పత్తులను మాత్రం అనుమతించదు. దీనివల్ల ఇటు రైతులకు భద్రత, అటు ఎగుమతిదారులకు లాభం చేకూరనుంది.
ఈ డీల్ వల్ల టెక్స్‌టైల్స్, లెదర్, జెమ్స్ అండ్ జువెలరీ, మెషినరీ, సీఫుడ్(సముద్ర ఉత్పత్తులు) ఎగుమతి చేసే వారికి భారీ ప్రయోజనం కలగనుంది. అమెరికాలో భారతీయ వస్తువులు తక్కువ ధరకే లభించడం వల్ల ఆర్డర్లు పెరుగుతాయి, తద్వారా ఎంఎస్ఎంఈ రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే, రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ, బొగ్గు, అత్యాధునిక సాంకేతికతను కొనుగోలు చేయనుంది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడమే కాకుండా భారత్ గ్లోబల్ సప్లై చైన్‌లో కీలక భాగస్వామిగా మారడానికి దోహదపడుతుంది.
టెక్నాలజీ పరంగా కూడా భారత్‌కు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల స్థాపనలో అమెరికా కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాయి. త్వరలోనే ఇరు దేశాల ప్రతినిధులు దీనిపై ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. మొత్తానికి మన వ్యవసాయాన్ని కాపాడుకుంటూనే, ఆధునిక సాంకేతికతను సొంతం చేసుకోవడంలో భారత్ అద్భుతమైన బ్యాలెన్స్ సాధించింది.

