India US Trade Deal : ప్రపంచాన్ని ఏలబోతున్న మేడ్ ఇన్ ఇండియా సోలార్..అగ్రరాజ్యంతో అదిరిపోయే ఒప్పందం
అగ్రరాజ్యంతో అదిరిపోయే ఒప్పందం

India US Trade Deal : భారతదేశం త్వరలోనే గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా అవతరించబోతోంది. అమెరికాతో కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం వల్ల భారతీయ పునరుత్పాదక ఇంధన సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితిని తొలగించి, దీర్ఘకాలిక సరఫరా సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం ఒక గొప్ప ముందడుగు అని పరిశ్రమ వర్గాలు కొనిాడుతున్నాయి. ఈ డీల్ వల్ల అమెరికాకు చేసే ఎగుమతులపై పన్నులు గణనీయంగా తగ్గడం మన దేశీయ కంపెనీలకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
సోలార్ రంగానికి టారిఫ్ ఊరట
అమెరికా విధించిన రెసిప్రోకల్ టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించడం వల్ల భారతీయ సోలార్ తయారీదారులకు గట్టి పోటీనిచ్చే సామర్థ్యం పెరిగింది. జాక్సన్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ గుప్తా అభిప్రాయం ప్రకారం.. ఈ ఒప్పందం వల్ల వ్యాపారాల్లో స్థిరత్వం రావడమే కాకుండా, కంపెనీలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి స్పష్టత లభిస్తుంది. ఓఎంసీ పవర్ సీఈఓ రోహిత్ చంద్ర మాట్లాడుతూ.. పన్నుల తగ్గింపుతో అమెరికా మార్కెట్లో భారతీయ సోలార్ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని, దీనివల్ల డిమాండ్ పెరిగి ఎగుమతులు ఊపందుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.
గ్లోబల్ క్లీన్ ఎనర్జీ పార్ట్‌నర్‌గా భారత్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇలాంటి సమయంలో కుదిరిన ఈ ఒప్పందం భారత్‌ను ఒక నమ్మకమైన భాగస్వామిగా నిలబెడుతుందని గోల్డీ సోలార్ ఎండీ ఈశ్వర్ ధోలకియా తెలిపారు. చైనాపై ఆధారపడకుండా ఉండాలని చూస్తున్న అమెరికాకు భారత్ ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఐనాక్స్ జీఎఫ్ఎల్ (INOXGFL) గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవాంశ్ జైన్ మాట్లాడుతూ.. టారిఫ్ తగ్గింపుతో అమెరికా మార్కెట్లో భారతీయ కంపెనీల పోటీతత్వం పెరుగుతుందని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలుస్తుందని విశ్లేషించారు.
ఎగుమతుల జోరు.. ఉపాధి హోరు
ఈ ఒప్పందం కేవలం ఎగుమతులకే పరిమితం కాకుండా దేశీయంగా తయారీ రంగాన్ని కూడా పరుగులు పెట్టిస్తుంది. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాల సృష్టికి ఇది దోహదపడనుంది. సోలార్ ప్యానెల్స్, విండ్ ఎనర్జీ పరికరాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో భారతీయ కంపెనీలు అమెరికన్ కంపెనీలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. మొత్తం మీద భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దేశీయ గ్రీన్ ఎనర్జీ రంగాన్ని మరో మెట్టు పైకి ఎక్కించిందని చెప్పవచ్చు.

