500% టారిఫ్ ఇక కలగానే మిగిలిపోనుందా?

India US Trade Deal : భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై జనవరి 13న కీలక నిర్ణయం వెలువడనుంది. సోమవారం న్యూఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితులని, నిజమైన స్నేహితుల మధ్య అభిప్రాయభేదాలు ఉండవచ్చని, కానీ మనస్పర్థలు ఉండవని ఆయన వ్యాఖ్యానించారు. భారత వస్తువులపై 500 శాతం టారిఫ్ విధిస్తామంటూ గతంలో అమెరికా పార్లమెంట్‌లో వచ్చిన ప్రతిపాదనలు ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే, తాజా చర్చల ద్వారా ఈ సమస్యలన్నీ త్వరలోనే సమసిపోతాయని గోర్ ధీమా వ్యక్తం చేశారు.

అమెరికా రాయబారి ఈ సందర్భంగా పాక్స్ సిలికా అనే సరికొత్త వ్యూహాత్మక చొరవను పరిచయం చేశారు. వచ్చే నెలలో భారత్‌ను ఈ గ్రూపులో పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరమని ఆహ్వానించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ రంగాల్లో సురక్షితమైన సిలికాన్ సప్లై చైన్‌ను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. భారత్ కూడా ఇందులో చేరితే, గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్‌లో మన దేశ స్థానం మరింత బలపడనుంది.

గత ఆరు రోజులుగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను వణికిస్తోంది. సోమవారం ఉదయం కూడా సెన్సెక్స్ సుమారు 700 పాయింట్లు పడిపోయి దారుణంగా కనిపించింది. అయితే, అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన సానుకూల వ్యాఖ్యలతో మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. ట్రేడ్ డీల్ కుదురుతుందనే నమ్మకంతో ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా, కొన్ని నిమిషాల్లోనే మార్కెట్ 700 పాయింట్లకు పైగా రికవర్ అయ్యి, గ్రీన్ మార్కులోకి వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 83,638 పాయింట్ల వద్ద లాభాల్లో ట్రేడ్ అవుతోంది.

13న ఏం జరగబోతోంది?

జనవరి 13న జరగబోయే తదుపరి రౌండ్ చర్చల్లో టారిఫ్ వివాదాలు, మార్కెట్ యాక్సెస్ వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు తగ్గించడం, అలాగే అమెరికా కంపెనీలకు భారత్‌లో మరిన్ని అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై తుది సంతకాలు జరగవచ్చు. ఒకవేళ ఈ డీల్ ఖరారైతే, అది అటు భారత ఆర్థిక వ్యవస్థకు, ఇటు దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ బూస్ట్‌ను ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story