India-US Trade Deal : అమెరికాతో అమీతుమీ..టారిఫ్‌ల తలనొప్పికి చెక్..భారీ ప్రకటనకు సిద్ధమైన మోదీ ప్రభుత్వం
భారీ ప్రకటనకు సిద్ధమైన మోదీ ప్రభుత్వం

India-US Trade Deal : భారత్, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడబోతోందా? అగ్రరాజ్యంతో మన దేశం జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయా? అంటే అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న టారిఫ్ గొడవలకు ముగింపు పాడుతూ, ఒక భారీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అందించిన సమాచారం ప్రకారం.. ఇరు దేశాలు ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఇటీవలే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్‌తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. అమెరికా భారత్ నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించినప్పటికీ, మన దేశం నుంచి ఎగుమతులు తగ్గకపోవడం విశేషం. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అమెరికాకు జరిగిన ఎగుమతులు 65.88 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది గత ఏడాది కంటే సుమారు 5 బిలియన్ డాలర్లు ఎక్కువ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఔషధాల ఎగుమతులపై టారిఫ్ ప్రభావం లేకపోవడం మనకు కలిసి వచ్చింది. అయితే టెక్స్‌టైల్, లెదర్ రంగాలపై సుంకాల భారం పడకుండా కొత్త ఒప్పందంలో స్పష్టత రానుంది.
ఇరాన్ చమురు.. ట్రంప్ హెచ్చరికలు
మరోవైపు ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం అదనపు టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్‌కు భారత్ చేసే ఎగుమతులు ఎక్కువగా మానవతా దృక్పథంతో చేసేవేనని, దీనిపై అమెరికా నుంచి వచ్చే తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని అధికారులు తెలిపారు. చమురు సరఫరా, అంతర్జాతీయ రాజకీయాల నేపథ్యంలో అమెరికాతో కుదుర్చుకోబోయే ఈ వాణిజ్య ఒప్పందం భారత్ కు చాలా కీలకం కానుంది. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా కొత్త మార్కెట్లను వెతకడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
యూరప్ తోనూ దోస్తీ.. ఎఫ్టీఏ సిద్ధం
అమెరికాతోనే కాకుండా యూరోపియన్ యూనియన్ తో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది. మొత్తం 24 అధ్యాయాలలో 20 అధ్యాయాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరింది. జనవరి నెలాఖరులోగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం వంటి సున్నితమైన అంశాలను ఈ ఒప్పందం నుంచి మినహాయించడంతో, దేశీయంగా ఎలాంటి రాజకీయ ఇబ్బందులు లేకుండానే ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది భారత్ ఎగుమతిదారులకు మరియు వ్యాపారవేత్తలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

