Visa Rules: విదేశీయులు భారతదేశానికి రావడాన్ని మరింత సులభతరం చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోకి వచ్చే విదేశీ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రయాణికులకు వీసా జారీ ప్రక్రియను సరళతరం చేయాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత వీసా నిబంధనల పుస్తకం వీసా మ్యాన్యువల్ 2019లో సమగ్ర సమీక్ష జరిపి, పలు అధ్యాయాలు, అనుబంధాలలో కీలక సవరణలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. క్లిష్టంగా ఉన్న ప్రక్రియను తగ్గించి, వీసా దరఖాస్తును అత్యంత సులభంగా మార్చడమే ఈ విప్లవాత్మక మార్పుల ప్రధాన లక్ష్యం.

13 నుంచి 9కి తగ్గనున్న వీసా కేటగిరీలు

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణల్లో భాగంగా వీసా విభాగాలలో భారీగా కోత విధిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న 13 ప్రధాన వీసా కేటగిరీల సంఖ్యను 9కి తగ్గించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే 49గా ఉన్న సబ్‌కేటగిరీల సంఖ్యను ఏకంగా 23కి పరిమితం చేస్తున్నారు. గత ఆగస్టు నెలలోనే దీనికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల మధ్య కీలక సమావేశం జరిగింది. అనవసరమైన కేటగిరీలను తొలగించి, స్పష్టమైన ఐదు లేదా ఆరు ప్రాథమిక వర్గాలుగా మార్చడం ద్వారా ప్రక్రియ వేగవంతం కానుంది.

అప్లికేషన్ ఫారమ్‌లో 70 శాతం ఖాళీలు రద్దు

వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రయాణికులకు పెద్ద ఊరటనిస్తూ అప్లికేషన్ ఫారమ్‌లోని 70 శాతం కాలమ్‌లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే సమాచారాన్ని పదే పదే అడిగే ప్రపత్రాలు, అనవసరమైన వ్యక్తిగత వివరాలు అడిగే ఖాళీలను తీసివేస్తున్నారు. దీనివల్ల దరఖాస్తుదారులు గంటల తరబడి ఫారమ్ నింపే శ్రమ తప్పనుంది. పూర్తిగా యూజర్ ఫ్రెండ్లీ విధానంలోకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ మారనుండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దరఖాస్తుదారులు చాలా తక్కువ సమయంలోనే తమ అప్లికేషన్లను పూర్తి చేసి సబ్‌మిట్ చేయవచ్చు.

విదేశీ పర్యాటక రంగం రికవరీకి ప్లాన్

పర్యాటక శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2025లో భారత్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య దాదాపు 91.5 లక్షలుగా నమోదైంది. గతంలో 2024లో ఈ సంఖ్య 99.5 లక్షలుగా ఉండగా, కరోనా మహమ్మారి కంటే ముందు 2019లో ఏకంగా 1.09 కోట్లుగా ఉండేది. కోవిడ్ తర్వాత కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోవడంతో టూరిజం రంగానికి కొత్త ఊపిరి పోసేందుకు ఈ వీసా సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఈ నిబంధనలు విదేశీయులను భారత్ వైపు ఆకర్షిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇతర భాషల్లోనూ వీసా దరఖాస్తులు అందుబాటులోకి?

అంతర్జాతీయ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు పర్యాటక రంగ నిపుణులు కేంద్రానికి పలు కీలక సూచనలు చేశారు. ప్రయాణానికి 120 రోజుల ముందే దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించాలని, స్పాన్సిరింగ్, జర్మన్, ఇటాలియన్ వంటి విదేశీ భాషల్లో కూడా అప్లికేషన్ ఫారమ్‌లను అందుబాటులోకి తేవా లని కోరారు. అలాగే చైనా పౌరులకు ఈ-వీసా సదుపాయం పునరుద్ధరించాలని సూచించారు. ఈ విజ్ఞప్తులను కూడా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం, త్వరలోనే కొత్త నిబంధనలతో కూడిన సులభతర వీసా విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.

Next Story