Indian Exports : మిడిల్ ఈస్ట్‌లో ముగిసిన యుద్ధం.. భారతీయ కంపెనీలకు మళ్లీ భారీగా ఎగుమతుల లాభాలు
భారతీయ కంపెనీలకు మళ్లీ భారీగా ఎగుమతుల లాభాలు

Indian Exports : మిడిల్ ఈస్ట్ దేశాలలో నెలకొన్న యుద్ధ వాతావరణం ముగిసి, అక్కడ శాంతి ఒప్పందం కుదరడంతో భారతీయ కంపెనీలు మళ్లీ ఆయా దేశాల మార్కెట్లపై పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఘర్షణల సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న ఎగుమతులను పునరుద్ధరించడానికి, అక్కడ పెరగబోయే డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి పలు రకాల పరిశ్రమలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆటోమొబైల్, కన్‌స్ట్రక్షన్ పరికరాలు, ఎలక్ట్రికల్ వస్తువులను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుతున్నాయి. దీనితో పాటు అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలలో బుకింగ్స్ కూడా ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సప్లై చైన్ సాధారణ స్థితికి రావడం వల్ల వ్యాపారాలు మళ్లీ లాభాల బాట పడతాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల ప్రొడక్షన్ స్పీడ్
యుద్ధం నడుస్తున్న సమయంలో మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేసే భారతీయ ఫ్యాక్టరీల ఉత్పత్తి సామర్థ్యం కేవలం 45 నుంచి 50 శాతానికి మాత్రమే పరిమితమైపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ అయిన ఏడబ్ల్యూఎల్ ఆగ్రో బిజినెస్, బిస్కెట్ల దిగ్గజం పార్లే ప్రొడక్ట్స్, ఆయుర్వేద బ్రాండ్ డాబర్ వంటి కంపెనీలు గల్ఫ్ దేశాల కోసం తమ ఫ్యాక్టరీల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా 90 శాతానికి పైగా పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. యుద్ధ సమయంలో షిప్పింగ్ రవాణా ఛార్జీలపై ప్రతి టన్నుకు దాదాపు 100 డాలర్ల అదనపు భారం పడింది, ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులపైనే వేశాయి. ఇప్పుడు రవాణా ఛార్జీలు సాధారణ స్థితికి వస్తుండటంతో గోధుమ పిండి, వంట నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు 5 నుంచి 9 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా వంటి మార్కెట్లలో భారతీయ ఎగుమతిదారులకు భారీగా కొత్త అవకాశాలు లభిస్తాయి.
ఆటోమొబైల్, కన్‌స్ట్రక్షన్ రంగానికి భారీ ఆశలు
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి కూడా మిడిల్ ఈస్ట్ దేశాలకు కార్ల ఎగుమతులను మళ్లీ పెంచేందుకు పెద్ద ప్లాన్ వేసింది. ఘర్షణలు ప్రారంభం కావడానికి ముందు మారుతి సుజుకి మొత్తం విదేశీ ఎగుమతులలో ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం వాటా 12 శాతానికి పైగా ఉండేది. అయితే గత కొన్ని నెలలుగా అక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో కంపెనీ తన ఎగుమతులను ఇతర దేశాల మార్కెట్ల వైపు మళ్లించింది. ఇప్పుడు అక్కడ శాంతి నెలకొనడంతో మారుతి మళ్లీ గల్ఫ్ దేశాలపై ఫోకస్ పెంచింది. మరోవైపు, యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలలో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంతో జేసీబీ ఇండియా కంపెనీకి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలు, మరమ్మతుల కోసం కన్‌స్ట్రక్షన్ పరికరాల అవసరం చాలా ఉంటుంది కాబట్టి, భారతీయ కంపెనీలకు ఇది దీర్ఘకాలిక బిజినెస్ ఆఫర్‌గా మారనుంది.
సప్లై చైన్ క్లియరెన్స్‌తో పెరగనున్న కార్పోరేట్ లాభాలు
భారతీయ కంపెనీల అంతర్జాతీయ వ్యాపారంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతం అత్యంత కీలకమైన భూమిక పోషిస్తోంది. డాబర్ కంపెనీకి వచ్చే మొత్తం అంతర్జాతీయ ఆదాయంలో దాదాపు 35 శాతం వాటా ఈ ప్రాంతం నుంచే వస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ దిగ్గజం హావెల్స్ కంపెనీకి తన ఎగుమతుల రెవెన్యూలో దాదాపు 40 శాతం వాటా మిడిల్ ఈస్ట్ ద్వారానే లభిస్తుంది. ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ మారికో మొత్తం ఆదాయంలో కూడా ఈ ప్రాంతం వాటా 4 శాతంగా ఉంది. పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయంక్ షా తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ తన ఎగుమతి ఉత్పత్తి సామర్థ్యాన్ని 50-60 శాతం నుంచి నేరుగా 90 శాతానికి పెంచుతోంది. యుద్ధం కారణంగా గతంలో తగ్గిన ప్రాఫిట్ మార్జిన్లు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటాయని, రవాణా ఖర్చులు తగ్గడం వల్ల కంపెనీల నికర లాభాలు భారీగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

