GoldI mport : గోల్డ్ అంటే క్రేజ్ మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారం.. మోదీ అందుకే ఆ విజ్ఞప్తి చేశారా?
దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారం.. మోదీ అందుకే ఆ విజ్ఞప్తి చేశారా?

GoldI mport : భారతీయులకు బంగారం అంటే ప్రాణం. శుభకార్యాలైనా, పండుగలైనా ఒంటి మీద బంగారం ఉండాల్సిందే. అయితే ఇదే అలవాటు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒక కీలక విజ్ఞప్తి చేశారు. రాబోయే ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. దీని వెనుక ఉన్న అసలు కారణాలు, మన దేశం ఎంత బంగారం దిగుమతి చేసుకుంటుంది, అది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
భారీ దిగుమతులు.. ఖర్చవుతున్న డాలర్లు
భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు వినియోగదారు. మన దేశ అవసరాల కోసం ఏటా సుమారు 700 నుంచి 900 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాము. దీనికోసం దాదాపు 50 బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీని ఖర్చు చేయాల్సి వస్తోంది. మన దేశంలో బంగారం ఉత్పత్తి కేవలం 1-2 టన్నులు మాత్రమే ఉండటంతో, దాదాపు 90 శాతం డిమాండ్ దిగుమతుల ద్వారానే తీరుతోంది. చమురు తర్వాత భారత్ అత్యధికంగా ఖర్చు చేసేది బంగారం కోసమే కావడం గమనార్హం.
ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడి
బంగారం దిగుమతి వల్ల దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయి. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. బంగారం అనేది కేవలం నిల్వ చేసుకునే సంపద మాత్రమే కానీ, అది ఫ్యాక్టరీల నిర్మాణానికో లేదా ఉత్పత్తి పెంచడానికో నేరుగా ఉపయోగపడదు. ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న సమయంలో, బంగారం కోసం భారీగా డాలర్లు ఖర్చు చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల ఎరువులు, ఇంధన ధరలు పెరుగుతుండటంతో అనవసర దిగుమతులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పాతాళానికి పడిపోయిన దిగుమతులు
ప్రధాని మోదీ విజ్ఞప్తి కంటే ముందే దేశంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గుముఖం పట్టాయి. జనవరి 2026లో 100 టన్నులుగా ఉన్న దిగుమతులు, మార్చి నాటికి 20-22 టన్నులకు పడిపోయాయి. గత 30 ఏళ్లలో (కోవిడ్ కాలాన్ని మినహాయిస్తే) ఇదే అత్యంత కనిష్ట స్థాయి. దీనికి కేవలం ధరలు పెరగడం మాత్రమే కారణం కాదు, జీఎస్టీ సమస్యలు, బ్యాంకుల అనుమతుల్లో జాప్యం మరియు కస్టమ్స్ నిబంధనల్లో మార్పులు కూడా దిగుమతులు తగ్గడానికి కారణమయ్యాయి.

