Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలు కోచ్‌లలో సీసీటీవీలు, స్టేషన్లలో ఫ్రీ వైఫై
రైలు కోచ్‌లలో సీసీటీవీలు, స్టేషన్లలో ఫ్రీ వైఫై

Indian Railways : భారతీయ రైల్వే తన ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో వేలాది రైలు కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల రాజ్యసభ, లోక్‌సభలో ఈ వివరాలను తెలియజేశారు.
రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేయడానికి భారతీయ రైల్వే ప్రాధాన్యత ఇస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రైళ్లలోని 11,535 కోచ్‌లకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో సుమారు 74,000 కోచ్‌లు, 15,000 రైలు ఇంజిన్‌లలో కూడా సీసీటీవీలను అమర్చనున్నారు. ప్రతి కోచ్‌లో నాలుగు కెమెరాలను అమరుస్తారు. కోచ్‌కు రెండు వైపులా ఉన్న ద్వారాల వద్ద రెండు చొప్పున కెమెరాలు ఉంటాయి. ఇది రైలు లోపల ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది.
ప్రయాణికులకు డిజిటల్ సౌకర్యాలను అందుబాటులోకి తేవడంలో రైల్వే మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవడానికి ప్రయాణికులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో 4G, 5G నెట్‌వర్క్ కవరేజ్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఉచిత వైఫై సేవలు ప్రయాణికులకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తున్నాయి.
స్టేషన్‌లో ఉచిత వైఫైని ఎలా ఉపయోగించాలి?
రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫైని ఉపయోగించడం చాలా సులభం.
* మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆన్ చేయండి.
* అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ల నుండి రైల్‌వైర్ అనే నెట్‌వర్క్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత మీ ఫోన్‌కు ఒక వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది.
* ఆ OTPని ఎంటర్ చేసి, కన్ఫాం చేసుకోవాలి.
ఈ ప్రక్రియ తర్వాత మీరు స్టేషన్‌లో హై-స్పీడ్ వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రయాణికులకు రైలు కోసం వేచి ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ముఖ్యమైన పనులను చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.
