Indian Railways : రైలు ప్రయాణికులకు కొత్త రూల్స్.. లగేజ్ మోసుకెళ్లే ముందు ఈ విషయం తెలుసుకోండి!
లగేజ్ మోసుకెళ్లే ముందు ఈ విషయం తెలుసుకోండి!

Indian Railways : రైలులో ప్రయాణం చేసేవారికి భారతీయ రైల్వేస్ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తోంది. ఇకపై ప్రయాణికులు తమతో తీసుకెళ్లే లగేజ్‌పై కూడా పరిమితులు ఉండనున్నాయి. విమానాశ్రయాల్లో మాదిరిగానే రైళ్లలో కూడా లగేజ్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీని వల్ల రైలు బోగీల్లో ప్రయాణికులకు కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. అంతేకాకుండా, రైల్వేలకు ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త నియమాలతో ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుంది.
టికెట్ క్లాస్‌ను బట్టి లగేజ్ పరిమితి
రైల్వేస్ రూపొందించిన కొత్త ప్రతిపాదన ప్రకారం.. ప్రతి ప్రయాణికుడు తమ టికెట్ క్లాస్‌ను బట్టి నిర్ణీత బరువు ఉన్న లగేజ్‌ను మాత్రమే ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితిని మించి అదనపు లగేజ్ ఉంటే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. AC ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు 70 కిలోల వరకు, AC టూ-టైర్లో 50 కిలోల వరకు, AC త్రీ-టైర్లో 40 కిలోల వరకు, స్లీపర్ క్లాస్లో 40 కిలోల వరకు, జనరల్ క్లాస్లో 35 కిలోల వరకు లగేజ్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఈ నిబంధనల అమలు కోసం, రైల్వే స్టేషన్లలో డిజిటల్ లగేజ్ తూకం యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. లగేజ్ బరువు పరిమితిని దాటితే, అక్కడే జరిమానా చెల్లించవచ్చు.
రైల్వే స్టేషన్లలో ఇకపై షాపింగ్ అనుభవం
కొత్త లగేజ్ నిబంధనలతో పాటు, రైల్వేస్ ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో, రైల్వే స్టేషన్లలో షాపింగ్ మాల్స్‌లో ఉండే ప్రీమియం బ్రాండ్ అవుట్‌లెట్‌లు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఈ చర్యతో ప్రయాణికులకు సౌలభ్యం పెరగడమే కాకుండా, రైల్వేలకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. ఈ కొత్త మార్పుల ద్వారా రైల్వే స్టేషన్లు మరింత ఆధునికంగా,ఆకర్షణీయంగా కనిపించనున్నాయి.
