Indian Rupee : మార్కెట్లను కుదిపేసిన ఒక్క ఫోన్ కాల్.. ట్రంప్ ప్రకటనతో ఒక్క రోజే రూపాయి 41 పైసలు జంప్
ట్రంప్ ప్రకటనతో ఒక్క రోజే రూపాయి 41 పైసలు జంప్

Indian Rupee : గత తొమ్మిది రోజులుగా అప్రతిహతంగా దూసుకుపోతూ భారత రూపాయిని బలితీసుకున్న అమెరికన్ డాలర్ హవాకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సీన్ పూర్తిగా మారిపోయింది. డాలర్ విసిరిన సవాల్ పై మన రూపాయి ఎదురు సవాల్ చేసి కరెన్సీ టేబుల్‌పై అద్భుతమైన రీతిలో సమాధానం చెప్పింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో చారిత్రక కనిష్ట స్థాయి అయిన 96.86 వద్ద ముగిసిన రూపాయి.. ఈరోజు ఏకంగా 41 పైసలు పుంజుకుని డాలర్‌తో పోలిస్తే 96.45 స్థాయికి చేరింది. ఇరాన్ యుద్ధం ముగింపునకు వస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన క్లూస్, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం రూపాయికి కొండంత బలాన్ని ఇచ్చాయి.
మార్కెట్లను కుదిపేసిన ట్రంప్ ఒక్క ఫోన్ కాల్
కరెన్సీ మార్కెట్లో ఇంత సడన్ మార్పు రావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ప్రధాన కారణం. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అయితే అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం.. ఈ విషయంలో ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్ లో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఇరాన్ మిలిటరీ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని నెతన్యాహు పట్టుబడుతుండగా.. ట్రంప్ మాత్రం దాడులు వద్దు శాంతి చర్చలే ముద్దు అనడంతో ఇజ్రాయెల్ ప్రధాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా, యూఏఈ, ఖతార్ దేశాల విజ్ఞప్తి మేరకు ట్రంప్ దాడులను వాయిదా వేయడంతో ప్రపంచ మార్కెట్లకు పెద్ద ఉపశమనం లభించింది.
రాకెట్ స్పీడ్‌తో పెరిగిన రూపాయి
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో గురువారం ఉదయం రూపాయి ఏకంగా 96.25 వద్దే ఓపెన్ అయి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత స్వల్ప ఒడిదుడుకులతో 96.45 వద్ద స్థిరపడింది. బుధవారం ఒకానొక దశలో రూపాయి 96.95 వద్దకు పడిపోయి 97 మార్కును తాకేలా కనిపించిన సంగతి తెలిసిందే. కేవలం భౌగోళిక రాజకీయ పరిస్థితులు మాత్రమే కాకుండా, రూపాయిని కాపాడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచబోతోందనే వార్తలు, మార్కెట్లోకి ఆర్‌బీఐ భారీగా డాలర్ లిక్విడిటీని పంపడం కూడా రూపాయి రికవరీకి బాగా హెల్ప్ అయ్యాయి.
110 డాలర్ల మార్కు నుంచి కిందకు పడిపోయిన క్రూడాయిల్ రేటు
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ముడిచమురు ధరలు ఎంతో కీలకం. గత కొన్ని రోజులుగా బారెల్ ముడిచమురు ధర 110 డాలర్ల మార్కును దాటేసి భయపెట్టగా.. ట్రంప్ శాంతి చర్చల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.71 శాతం తగ్గి 105.77 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. చమురు ధరలు తగ్గడం వల్ల భారత్‌కు దిగుమతుల భారం తగ్గి కరెన్సీ మార్కెట్లో రూపాయిపై ఉన్న ఒత్తిడి చాలావరకు తొలగిపోయింది. అయితే మార్కెట్ నిపుణుల ప్రకారం.. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గనంత వరకు రూపాయిపై స్వల్ప ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది.
మళ్లీ పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ
రూపాయి రికవరీతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఈరోజు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 327 పాయింట్లు లాభపడి 75,646 వద్ద ట్రేడ్ అవ్వగా.. జాతీయ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 23,772 మార్కు వద్ద కొనసాగుతోంది. బుధవారం నాడు విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,597 కోట్ల విలువైన షేర్లను విక్రయించినప్పటికీ, గురువారం నాటి పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్లను లాభాల బాట పట్టించింది. టెక్నికల్ పరంగా చూస్తే డాలర్-రూపాయి విలువకు 97.00 వద్ద గట్టి రెసిస్టెన్స్ ఉందని, రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలోపేతమై 95.50 స్థాయికి వచ్చే అవకాశం ఉందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పబారీ విశ్లేషించారు.

