Smartphone: చైనీస్ బ్రాండ్లకు షాక్.. భారత్‌లో పుంజుకుంటున్న స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు
స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు

Smartphone: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎంతోకాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్న చైనీస్ దిగ్గజాలు ఒప్పో, వివో, షామీ కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. మెమరీ చిప్ ధరలు విపరీతంగా పెరగడం, బడ్జెట్ ఫోన్ల డిమాండ్ పడిపోవడం కారణంగా ఈ విదేశీ బ్రాండ్లు తమ చౌక మోడళ్లను తగ్గిస్తున్నాయి. ఈ పరిణామం దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లయిన లావా, ఐ+ సంస్థలకు పెద్ద అవకాశంగా మారింది. ఫలితంగా మన దేశ కంపెనీల మార్కెట్ వాటా గత ఎనిమిదేళ్లలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది.
మెమరీ చిప్ ధరల పెరుగుదలే అసలు కారణం
ప్రస్తుతం బడ్జెట్ ఫోన్ల తయారీలో మెమరీ కాంపోనెంట్స్ ఖర్చు దాదాపు 40 శాతానికి పైగా ఉంటోంది. దీంతో తక్కువ ధరలో ఫోన్లు విక్రయించడం చైనీస్ కంపెనీలకు భారంగా మారింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆ సంస్థలు మంచి లాభాలు వచ్చే మిడ్-రెంజ్ అలాగే ప్రీమియం హ్యాండ్సెట్ల వైపు దృష్టి మళ్లించాయి. ఈ ఖాళీ స్థలాన్ని భర్తీ చేయడానికి లావా, ఐ+ వంటి స్వదేశీ బ్రాండ్లు వేగంగా ముందుకు వచ్చాయి. కౌంటర్‌పాయింట్ అంచనాల ప్రకారం దేశీయ బ్రాండ్ల సంయుక్త మార్కెట్ వాటా ఏడు శాతానికి పెరిగింది.
ప్రభుత్వ పీఎల్ఐ పథకాలు
గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్‌లో మొబైల్ తయారీ రంగం పూర్తిగా మారిపోయింది. దేశంలో మొబైల్ ఫోన్ల ప్రొడక్షన్ రికార్డు స్థాయిలో విస్తరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాలు, సరికొత్త మొబైల్ మ్యానిఫ్యాక్చరింగ్ స్కీమ్‌లు దేశీయ కంపెనీలకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నాయి. విదేశీ దిగ్గజాలపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా రీసెర్చ్, డిజైన్, సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసుకునే వెసులుబాటు దక్కుతోంది. దీనివల్ల నాణ్యమైన పరికరాలను తక్కువ ధరకు అందించే సామర్థ్యం స్వదేశీ బ్రాండ్లకు లభిస్తోంది.
కస్టమర్ల నమ్మకం గెలవడమే అసలైన సవాలు!
మార్కెట్లో మంచి అవకాశం ఉన్నప్పటికీ, లావా లేదా ఐ+ కంపెనీల ముందు ఇంకా పెద్ద సవాళ్లు ఉన్నాయి. చిన్న బ్రాండ్లు ప్రతి మోడల్ కి పరిమిత సంఖ్యలోనే యూనిట్లను విక్రయించగలుగుతున్నాయి. కేవలం తక్కువ ధర ఉందనే కారణంతో కస్టమర్లు కొనుగోలు చేసినప్పటికీ, దీర్ఘకాలికంగా నిలబడాలంటే బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అద్భుతమైన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ అత్యవసరం. చైనీస్ కంపెనీలు పూర్తిగా కనుమరుగైపోవు కాబట్టి, టెక్నాలజీ పరంగా రాణించినప్పుడే ఈ తాత్కాలిక లాభం శాశ్వత విజయంగా మారుతుంది.

