Real Estate : దుబాయ్‌లో భారతీయుల హవా.. ఆస్తుల కొనుగోలులో టాప్ ప్లేస్‌కు చేరిన ఇండియన్ ఇన్వెస్టర్లు
ఇండియన్ ఇన్వెస్టర్లు

Real Estate : దుబాయ్ అంటే ఒకప్పుడు కేవలం భారతీయులకు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే ఒక ఉపాధి కేంద్రంగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కాలం వేగంగా మారింది. నేడు భారతీయులు దుబాయ్‌లో కేవలం కార్మికులుగానో, వ్యాపారులుగానో స్థిరపడటం లేదు, ఏకంగా అక్కడి రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసిస్తున్నారు. గత ఐదేళ్లుగా రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ ధరలు ప్రస్తుతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకున్న భారతీయ పెట్టుబడిదారులు అక్కడ భారీగా ఇళ్లు, భూములను కొనుగోలు చేస్తున్నారు. దీంతో దుబాయ్‌లో అత్యధిక ఆస్తులు కొంటున్న విదేశీయుల జాబితాలో భారతీయులు వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచారు.
గత కొన్నేళ్లుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏటా 17 నుంచి 18 శాతం వరకు ధరలు పెరిగాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త ప్రాజెక్టులు భారీగా రావడంతో సప్లై పెరిగి, వార్షిక ధరల వృద్ధి రేటు 4 నుంచి 5 శాతానికి పరిమితమైంది. దీనిని మార్కెట్ పతనంగా కాకుండా సాధారణ స్థితికి రావడంగా నిపుణులు భావిస్తున్నారు. ధరల వేగం తగ్గడంతో కొనుగోలుదారులకు మంచి డీల్స్ లభిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల వల్ల పశ్చిమాసియాలో అనిశ్చితి పెరిగినప్పటికీ, దుబాయ్ మాత్రం సురక్షితమైన పెట్టుబడి కేంద్రంగా నిలిచింది. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను దుబాయ్ వైపు మళ్లించారు.
భారతీయులు ఇంత పెద్ద మొత్తంలో దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. దుబాయ్‌లో ప్రాపర్టీలపై వచ్చే అద్దె ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు యూఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను లేకపోవడం ఇన్వెస్టర్లకు అతిపెద్ద వరంలా మారింది. అలాగే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికి లభించే గోల్డెన్ వీసా సౌకర్యం ద్వారా అక్కడ ఎక్కువ కాలం నివసించే అవకాశం లభిస్తుంది. నైట్ ఫ్రాంక్ వంటి ప్రముఖ సంస్థల నివేదికల ప్రకారం, భారతీయ పెట్టుబడిదారులు దుబాయ్‌లో ఇప్పటివరకు సుమారు రూ.85,000 కోట్ల నుంచి రూ.95,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడం విశేషం.
భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి మెట్రో నగరాలకు చెందిన అత్యంత సంపన్నులు దుబాయ్‌లోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, విల్లాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వీరితో పాటు భారతీయ మధ్యతరగతి కుటుంబాలు కూడా భవిష్యత్తు అవసరాల కోసం అక్కడ ఫ్లాట్లను బుక్ చేసుకుంటున్నాయి. దుబాయ్‌లో మొత్తం ప్రాపర్టీలపై భారతీయులకు ఎంత శాతం వాటా ఉందనే దానికి అధికారిక లెక్కలు లేనప్పటికీ, విదేశీ కొనుగోలుదారులలో భారతీయులదే అగ్రస్థానం అని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో యూఏఈలో భారతీయుల ఆర్థిక, సామాజిక ప్రాబల్యం మరింత పెరగనుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

