Credit Card: ఒక్క నెలలోనే రూ.2.45 లక్షల కోట్ల షాపింగ్.. క్రెడిట్ కార్డులతో భారతీయుల రికార్డు బ్రేకింగ్ ఖర్చు
భారతీయుల రికార్డు బ్రేకింగ్ ఖర్చు

Credit Card: దసరా, దీపావళి పండుగల సీజన్‌లో దేశవ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున షాపింగ్ చేశారు. ఈ కొనుగోళ్లలో క్రెడిట్ కార్డుల వినియోగం ఆకాశాన్ని తాకింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్ నెలలో భారతీయులు క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.2.45 లక్షల కోట్లు ఖర్చు చేశారు. సెప్టెంబర్ నెలలో నమోదైన రూ.2.04 లక్షల కోట్లతో పోలిస్తే, కేవలం ఒక్క నెలలోనే కార్డుల ఖర్చు 20 శాతం పెరిగింది. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈసారి 14.4 శాతం అధికంగా షాపింగ్ జరగడం విశేషం.
ఖర్చు చేయడంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నంబర్ వన్
క్రెడిట్ కార్డుల వాడకంలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఒక్క అక్టోబర్ నెలలోనే హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు రూ.70,115 కోట్ల విలువైన కొనుగోళ్లు చేశారు. సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 7.6 శాతం ఎక్కువ. అయితే వృద్ధి రేటులో మిగతా ప్రధాన బ్యాంకులు దూకుడు చూపించాయి. రెండో స్థానంలో నిలిచిన ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్లు 31 శాతం వృద్ధితో రూ.45,797 కోట్లు ఖర్చు చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులు ఏకంగా 37 శాతం జంప్‌తో రూ.42,295 కోట్లు స్వాइప్ చేయగా, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు 30.5 శాతం పెరుగుదలతో రూ.30,211 కోట్ల షాపింగ్ చేశారు.
షోరూమ్‌ల కంటే ఆన్‌లైన్ షాపింగ్‌కే జనం ఓటు
పండుగ రద్దీలో బజార్లకు వెళ్లడం కంటే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికే జనం ఎక్కువ ఆసక్తి చూపారు. అక్టోబర్‌లో జరిగిన మొత్తం రూ.2.45 లక్షల కోట్ల ఖర్చులో, రూ.1.54 లక్షల కోట్లు కేవలం ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపైనే వెచ్చించారు. అంటే మొత్తం ఖర్చులో 63 శాతం వాటా ఆన్‌లైన్ షాపింగ్‌దే కావడం గమనార్హం. మరోవైపు నేరుగా దుకాణాలు, షోరూమ్‌లలోని స్వైపింగ్ మెషీన్ల ద్వారా రూ.90,562 కోట్ల లావాదేవీలు జరిగాయి.
ఒక్క నెలలోనే 14 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడంతో పాటు కొత్తగా కార్డులు తీసుకునే వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. అక్టోబర్ నెలలో దేశంలోని ప్రధాన బ్యాంకులు అన్నీ కలిసి 14 లక్షల కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య 12.67 కోట్లకు చేరింది. సెప్టెంబర్ నెలలో ఈ సంఖ్య 12.53 కోట్లుగా ఉండేది.
చిన్న బిల్లులకు కూడా కార్డుల వాడకం
ఆర్‌బీఐ నివేదికలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజలు ఇప్పుడు కేవలం ఖరీదైన వస్తువులు కొనడానికే కాకుండా, రోజువారీ చిన్న అవసరాలకు కూడా క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. వార్షిక ప్రాతిపదికన మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్య 32 శాతం పెరిగి 68.3 కోట్లకు చేరింది. అయితే కార్డులు ఎక్కువసార్లు స్వైప్ అయినప్పటికీ, ఒక్కో లావాదేవీ సగటు విలువ తగ్గింది. గతేడాది ఒక్కో ట్రాన్సాక్షన్‌కు సగటున రూ.4,133 ఖర్చు చేయగా, ఇప్పుడు అది రూ.3,585 కి పరిమితమైంది. సామాన్యులు సైతం చిన్న బిల్లుల చెల్లింపులకు క్రెడిట్ కార్డులను సులభమైన మార్గంగా ఎంచుకుంటున్నారని దీని ద్వారా స్పష్టమవుతోంది.

