Semiconductor : సెమీకండక్టర్ హబ్‌గా ఇండియా.. చైనా, తైవాన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధం
చైనా, తైవాన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధం
Semiconductor : ప్రపంచ టెక్నాలజీ రంగంలో రారాజుగా ఎదిగేందుకు భారత్ మరో భారీ అడుగు వేస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, కార్లు, వాషింగ్ మెషీన్లు.. ఇలా మనం వాడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులో కీలకమైన సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఏకంగా రూ.లక్ష కోట్ల (సుమారు 10.8 బిలియన్ డాలర్లు) భారీ నిధితో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వచ్చే రెండు మూడు నెలల్లోనే ఈ మెగా ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్‌ల కోసం తైవాన్, చైనా వంటి దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆ పరిస్థితిని మార్చి, భారత్‌ను గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం. ఈ కొత్త ఫండ్ ద్వారా చిప్ డిజైన్ చేసే కంపెనీలకు, తయారీ యంత్రాలు సరఫరా చేసే వారికి, సప్లై చైన్ ప్రాజెక్టులకు భారీగా సబ్సిడీలు అందించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చిప్‌ల అవసరం విపరీతంగా పెరగడంతో, ముందస్తుగా ఈ భారీ పెట్టుబడులకు తెరతీశారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2021లో సుమారు 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీని ఫలితంగా దిగ్గజ సంస్థలు భారత్ వైపు క్యూ కట్టాయి. అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ ఇప్పటికే గుజరాత్‌లో చిప్ అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుండగా, మన దేశీ దిగ్గజం టాటా గ్రూప్ కూడా గుజరాత్‌లోనే సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, ప్యాకేజింగ్ యూనిట్ పనులను వేగవంతం చేసింది. ఐఫోన్ల తయారీలో యాపిల్ సంస్థ భారత్‌ను ఎలాగైతే ఎంచుకుందో, చిప్ కంపెనీలు కూడా అదే బాట పట్టాలని ప్రభుత్వం కోరుకుంటోంది.
రాబోయే కాలంలో కేవలం చిప్‌ల అసెంబ్లీ మాత్రమే కాకుండా, మోడ్రన్ టెక్నాలజీతో కూడిన చిప్‌లను ఇక్కడే సొంతంగా తయారు చేయాలన్నది ప్రభుత్వ ప్లాన్. 2032 నాటికి ప్రపంచంలోని అగ్ర దేశాలతో సమానంగా భారత్ చిప్ తయారీ సామర్థ్యాన్ని సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లక్ష్యం నెరవేరితే దేశంలో లక్షలాది మంది యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించడమే కాకుండా, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి.

