Indian Army : మోడీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. 15 ఏళ్లలో యుద్ధం అంటే అంతరిక్షంలో అయినా సరే!
15 ఏళ్లలో యుద్ధం అంటే అంతరిక్షంలో అయినా సరే!

Indian Army : ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, భారత్ తన రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భారత ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అమలు చేసే ఒక వినూత్నమైన రక్షణ ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం, భవిష్యత్తులో జరగబోయే యుద్ధాల కోసం సైన్యాన్ని అడ్వాన్సుడ్ టెక్నాలజీతో సిద్ధం చేయడం. ఇందులో అణ్వాయుధ శక్తితో నడిచే యుద్ధనౌకలు, నెక్ట్స్ జనరేషన్ వార్ ట్యాంకులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, స్టీల్త్ బాంబర్ డ్రోన్‌లు, కృత్రిమ మేధస్సు (AI)తో పనిచేసే ఆయుధాలు, అంతరిక్ష యుద్ధ వ్యూహాలు వంటివి ఉన్నాయి. ఈ ప్రణాళిక ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడంపై కూడా దృష్టి పెట్టింది.
భారత సైన్యానికి కొత్త ఆయుధాలు
ఈ ప్రణాళిక ప్రకారం, పాత ఆయుధాల స్థానంలో కొత్త, అత్యంత అడ్వాన్సుడ్ వెపన్స్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా భారత సైన్యం 1,800 కొత్త, శక్తివంతమైన యుద్ధ ట్యాంకులను, అలాగే పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడానికి ఉపయోగపడే 400 తేలికపాటి యుద్ధ ట్యాంకులను ప్రొక్యూర్ చేయనుంది. అంతేకాకుండా, శత్రువుల ట్యాంకులను ధ్వంసం చేయగల 50,000 క్షిపణులు, ఐఈడీలను (IEDs) గుర్తించి నాశనం చేయగల 700 రోబోటిక్ వ్యవస్థలను కూడా కొనుగోలు చేయనున్నారు. ఈ కొత్త ఆయుధాలు సైన్యం శక్తిని గణనీయంగా పెంచుతాయని భావిస్తున్నారు.
భారత నౌకాదళానికి ఆధునిక ఆయుధాలు
భారత నౌకాదళం కూడా ఈ ప్రణాళికలో భాగంగా భారీగా ఆధునీకరణ చేయబడుతోంది. నౌకాదళానికి కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, నెక్ట్స్ జనరేషన్ 10 ఫ్రిగేట్‌లు (కొత్త రకం యుద్ధనౌకలు), ఏడు అడ్వాన్సుడ్ కార్వెట్‌లు, నాలుగు ల్యాండింగ్ డాక్ ప్లాట్‌ఫామ్‌లు రానున్నాయి. ఈ నౌకల్లో కనీసం 10 యుద్ధనౌకలకు అణుశక్తితో నడిచే ఇంజిన్‌లను అమర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది నౌకాదళం కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి సహాయపడుతుంది.
భారత వైమానిక దళానికి అడ్వాన్సుడ్ వెపన్స్
నేటి యుద్ధంలో అత్యంత కీలక పాత్ర పోషించే వైమానిక దళం కోసం కూడా ప్రభుత్వం ఒక పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. వైమానిక దళం 75 నకిలీ శాటిలైట్‌లను (సూడో శాటిలైట్స్), 150 స్టీల్త్ బాంబర్ డ్రోన్‌లను, 100 కంటే ఎక్కువ రిమోట్ ఆపరేటెడ్ యుద్ధ విమానాలను పొందనుంది. ఈ నకిలీ శాటిలైట్‌లు వాణిజ్య విమానాలు, అసలు శాటిలైట్‌లు ప్రయాణించే ఎత్తు మధ్యలో ఎగురుతాయి. ఇవి చైనా, పాకిస్థాన్ సరిహద్దులతో పాటు సముద్ర సరిహద్దుల వంటి కీలక ప్రదేశాలను పర్యవేక్షించి, అత్యంత కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి.
2035కి సుదర్శన చక్ర
వచ్చే పదేళ్లలో భారతదేశానికి సొంతంగా ఒక అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదర్శన చక్ర మిషన్‌ను ప్రకటించారు. ఈ మిషన్ ప్రకారం 2035 నాటికి దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలకు, ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర వ్యూహాత్మక ప్రాంతాలకు భద్రత కల్పిస్తారు. ఈ వ్యవస్థలో డ్రోన్‌లు, లేజర్‌లు, కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆధునిక సైనిక సాంకేతికతలు ఉంటాయి. ఇది శత్రువుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, ప్రతీకార దాడులను కూడా కచ్చితంగా చేయగలదు.
