Ethanol Blending : ఇథనాల్ మిషన్‌పై కేంద్రం బిగ్ ప్లాన్.. మూడేళ్లలో రూ.1.72 లక్షల కోట్ల ఖర్చు
రూ.1.72 లక్షల కోట్ల ఖర్చు

Ethanol Blending : భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ ప్రాజెక్ట్ పై కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోంది. పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు రాబడి కల్పించడమే లక్ష్యంగా ఇథనాల్ కొనుగోళ్లను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇథనాల్ కొనుగోళ్ల కోసం గడిచిన మూడేళ్లలో ఏకంగా రూ.1.72 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించింది.
మూడేళ్లలో రూ.1.72 లక్షల కోట్ల కొనుగోళ్లు
రాజ్యసభలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇథనాల్ సరఫరా సంవత్సరం 2023-24లో చమురు సంస్థలు రూ.48,757 కోట్లు ఖర్చు చేయగా, ESY 2024-25లో అది రూ.73,996 కోట్లకు చేరింది. ఇక ప్రస్తుత ESY 2025-26లో జూన్ నాటికే రూ.49,577 కోట్లతో ఇథనాల్ కొనుగోలు చేశారు. చెరకు రసం, షుగర్ సిరప్, బీ-హెవీ, సీ-హెవీ మొలాసెస్ లాంటి చెరకు ఉత్పత్తులతో పాటు పాడైపోయిన ధాన్యం, ఎఫ్‌సిఐ వద్ద ఉన్న బియ్యం, జొన్నలు/మొక్కజొన్నలను ముడిసరుకుగా వాడుతూ ఈ ఇథనాల్‌ను తయారు చేస్తున్నారు.
దేశంలో 501 ఇథనాల్ తయారీ యూనిట్లు
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం కింద ఇథనాల్ సరఫరా కోసం జూలై 16, 2026 నాటికి దేశవ్యాప్తంగా 501 ఇథనాల్ తయారీ యూనిట్లను చమురు కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. కేవలం బయటి ఉత్పత్తిదారుల నుంచే కాకుండా ఐఓసిఎల్, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా స్వయంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. IOCL రోజుకు 228 కిలోలీటర్ల సామర్థ్యంతో, BPCL రోజుకు 200 కిలోలీటర్ల సామర్థ్యంతో, HPCL బయోఫ్యూయెల్స్ రోజుకు 120 కిలోలీటర్ల సామర్థ్యంతో ఇథనాల్‌ను తయారు చేస్తున్నాయి.
ఇథనాల్ పెట్రోల్ వాడకంలో యూపీ ఫస్ట్
దేశవ్యాప్తంగా ఇథనాల్ కలగలిపిన పెట్రోల్ విక్రయాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ESY 2024-25 కాలంలో యూపీలో అత్యధికంగా 124.98 కోట్ల లీటర్ల ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అమ్ముడైంది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (110.66 కోట్ల లీటర్లు), తమిళనాడు (92.18 కోట్ల లీటర్లు), కర్ణాటక (79.24 కోట్ల లీటర్లు), గుజరాత్ (56.29 కోట్ల లీటర్లు) ఉన్నాయి. నిరంతరం విస్తరిస్తున్న సరఫరా నెట్‌వర్క్ వల్ల దేశవ్యాప్తంగా క్లీన్ ఫ్యూయెల్ వినియోగం శరవేగంగా పెరుగుతోంది.

