Credit Card : భారతదేశంలో అప్పు తీసుకుని ఖర్చు చేసే సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ అంటే కేవలం ధనికులకే పరిమితం అనుకునేవారు, కానీ ఇప్పుడు సామాన్యుల చేతిలో కూడా ఇవి మెరుస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య రికార్డ్ స్థాయిలో 11.9 కోట్లు దాటిపోయింది. ప్రైవేట్ బ్యాంకుల హవా కొనసాగుతున్నప్పటికీ, ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు దూకుడు ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నివేదికల ప్రకారం.. మార్చి 2026 నాటికి భారత క్రెడిట్ కార్డ్ మార్కెట్ 11.9 కోట్ల స్థాయికి చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 11 కోట్లుగా ఉండేది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కోటి మందికి పైగా కొత్తగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులుగా మారారు. ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 22.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎస్‌బిఐ కార్డ్స్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు కూడా ఈ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నాలుగు బ్యాంకులు కలిపి దేశంలోని మొత్తం కార్డులలో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి.

ప్రైవేట్ బ్యాంకులు మార్కెట్ వాటాలో ముందున్నప్పటికీ, వృద్ధి రేటులో మాత్రం ప్రభుత్వ బ్యాంకులు బాజీ కొట్టాయి. ప్రభుత్వ బ్యాంకులు ఏడాది ప్రాతిపదికన 11.3 శాతం వృద్ధిని నమోదు చేయగా, ప్రైవేట్ బ్యాంకుల వృద్ధి 8.3 శాతానికే పరిమితమైంది. మరోవైపు, విదేశీ బ్యాంకులు తమ వ్యాపారాన్ని తగ్గించుకుంటున్నాయి, వీటి కార్డుల సంఖ్యలో 5.4 శాతం తగ్గుదల కనిపించింది. ప్రభుత్వ బ్యాంకులు తమ భారీ నెట్‌వర్క్‌ను వాడుకుంటూ టైర్-2, టైర్-3 నగరాల్లో క్రెడిట్ కార్డులను వేగంగా విస్తరిస్తున్నాయి.

ఒకప్పుడు ప్రభుత్వ బ్యాంకుల కార్డులు ఉన్నవారు ఖర్చు తక్కువగా చేస్తారనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. ప్రైవేట్ బ్యాంకుల కార్డుదారుల సగటు ఖర్చు 4 శాతం తగ్గి రూ.18,948 కి చేరగా, ప్రభుత్వ బ్యాంకుల కార్డుదారుల ఖర్చు 17 శాతం పెరిగి రూ.16,847 కి చేరింది. అంటే సామాన్యులు కూడా ఇప్పుడు క్రెడిట్ కార్డులతో విచ్చలవిడిగా షాపింగ్ చేస్తున్నారన్నమాట! ఈ మార్పుకు ప్రధాన కారణం క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేసే సదుపాయం రావడం. ప్రభుత్వ బ్యాంకులు రూపే కార్డులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో, ప్రజలు కిరాణా దుకాణాల వద్ద కూడా క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.

ప్రభుత్వ బ్యాంకుల ఈ విజయానికి మూడు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, చిన్న నగరాల్లో వీరికి ఉన్న పట్టు. రెండోది, ఫిన్‌టెక్ సంస్థలు, ఈ-కామర్స్ సైట్లతో చేసుకున్న భాగస్వామ్యాలు. మూడవది, సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేసే ప్రక్రియ. జెఫియన్ క్యాపిటల్ వంటి విశ్లేషకులు చెబుతున్న ప్రకారం.. ప్రభుత్వ బ్యాంకులు తమ వద్ద ఉన్న భారీ ఖాతాదారుల డేటాను సమర్థవంతంగా వాడుకుంటూ పర్సనలైజ్డ్ ఆఫర్లతో కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ బ్యాంకుల మార్కెట్ వాటా ఇంకా పెరిగే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story