ఇదంతా దేనివల్ల అంటే ?

Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక శుభవార్త వెలువడింది. దేశ జీడీపీకి, ప్రభుత్వ రుణానికి మధ్య ఉన్న నిష్పత్తి రాబోయే దశాబ్దంలో గణనీయంగా తగ్గుతుందని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుతం 81 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి, 2034-35 నాటికి 71 శాతానికి పడిపోతుందని ఈ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ సానుకూల అంచనాతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత పథకాలు రుణ భారాన్ని పెంచుతున్నాయని, దీనిపై కేంద్రం అప్రమత్తంగా ఉండాలని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ హెచ్చరించింది.

కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం రుణ బాధ్యత రాబోయే ఐదు నుండి పది సంవత్సరాల కాలంలో క్రమంగా తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం 81 శాతంగా ఉన్న జీడీపీ-రుణ నిష్పత్తి 2030-31 నాటికి 77 శాతానికి, 2034-35 నాటికి 71 శాతానికి తగ్గుతుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం భారతదేశ మొత్తం రుణ మొత్తం రూ.181 లక్షల కోట్లు ఉంది.

GDP-రుణ నిష్పత్తి తగ్గడం అంటే, మున్ముందు ప్రభుత్వ రుణం మొత్తం తగ్గుతుందని కాదు. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రుణం మొత్తం పెరుగుతున్నప్పటికీ, దానికంటే ఎక్కువ వేగంతో జీడీపీ వృద్ధి చెందుతూ పోవడం వల్ల ఈ నిష్పత్తి తగ్గుతుంది. అంటే, దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరగడం వల్ల రుణాన్ని నిర్వహించగలిగే సామర్థ్యం మెరుగుపడుతుందని అర్థం. నిష్పత్తి తగ్గినప్పటికీ, రుణాల స్థాయి మాత్రం అధికంగానే ఉంటుంది.

భారత ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రగతి పట్ల ఈ నివేదిక సానుకూలంగా ఉన్నప్పటికీ, రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ గురించి మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలు వారి రుణ భారాన్ని గణనీయంగా పెంచుతున్నాయని నివేదిక హెచ్చరించింది.

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం రుణ నిష్పత్తి తగ్గినప్పటికీ, వడ్డీ చెల్లింపుల సమస్య మాత్రం ప్రభుత్వాన్ని వేధించనుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో, వడ్డీ చెల్లింపుల కోసం చెల్లించే వాటా పెరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించడం ఒక సవాలుగా మారుతుందని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సలహా ఇచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story