2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు భారత ఈ-కామర్స్ మార్కెట్

India's E-commerce Boom : భారతదేశంలో షాపింగ్ చేసే విధానం పూర్తిగా మారిపోతోంది. ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే నేరుగా దుకాణానికి వెళ్లేవారు, కానీ ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్ ఫోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా మారిపోయింది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం 120-140 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఈ-కామర్స్ మార్కెట్, 2030 నాటికి ఏకంగా 300 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.25 లక్షల కోట్లు) చేరుకోనుంది. అంటే రాబోయే ఐదేళ్లలో మన ఆన్‌లైన్ షాపింగ్ సామ్రాజ్యం రెట్టింపు కాబోతోంది.

స్క్రీన్ నుంచి స్టోర్ వరకు..

ఈ రోజుల్లో వినియోగదారులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. 10 మందిలో ఐదుగురు ఏదైనా వస్తువును ఆఫ్‌లైన్ స్టోర్‌లో కొనేముందు, దాని ధర, ఫీచర్ల కోసం ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేస్తున్నారు. దీన్నే మల్టీ-ఛానల్ షాపింగ్ అని పిలుస్తున్నారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఎంతగా పెరుగుతున్నా, ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్ కూడా ఏటా 13-14 శాతం వృద్ధి చెందుతుండటం విశేషం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటినీ కలిపి వ్యాపారం చేసే బ్రాండ్లు మాత్రమే భవిష్యత్తులో నిలదొక్కుకుంటాయని బీసీజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రామీణ భారతం, మహిళలదే హవా

ప్రస్తుతం మన దేశంలో 30 కోట్ల మంది ఆన్‌లైన్ షాపర్లు ఉండగా, 2030 నాటికి వీరి సంఖ్య 44 కోట్లకు చేరనుంది. వీరిలో 30 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. అలాగే ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారిలో 45 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇంటి నుంచే ప్రశాంతంగా, సురక్షితంగా, రకరకాల ఆప్షన్లను చూసుకునే వీలుండటంతో మహిళలు డిజిటల్ షాపింగ్‌కు జై కొడుతున్నారు. మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో 45 శాతం, ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాల్లో 23 శాతం వాటా ఆన్‌లైన్‌దే కావడం విశేషం.

క్విక్ కామర్స్.. 10 నిమిషాల్లో ఇంటికి

ప్రస్తుతం షాపింగ్ లో సరికొత్త ట్రెండ్ క్విక్ కామర్స్. అంటే ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వస్తువులు ఇంటికి చేరడం. ఈ విభాగం ఏకంగా 100 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో దీనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీనికి తోడు సోషల్ మీడియా, చాట్ కామర్స్ (వాట్సాప్ ద్వారా షాపింగ్) కూడా 45 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకప్పుడు ఒక బ్రాండ్ రూ.100 కోట్ల రెవెన్యూ సాధించాలంటే 11 ఏళ్లు పట్టేది, కానీ ఇప్పుడు ఈ-కామర్స్ పుణ్యమా అని కేవలం 7 ఏళ్లలోనే ఆ మైలురాయిని చేరుకుంటున్నారు.

చిన్న వ్యాపారులకు వరప్రసాదం

ఈ-కామర్స్ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న వ్యాపారులకు (MSMEs) కూడా అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది. సుమారు 90 శాతం మంది చిన్న ఆన్‌లైన్ సెల్లర్లు తమ అమ్మకాలు పెరిగాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో జాతీయ స్థాయిలో మార్కెట్‌ను దక్కించుకోవడానికి డిజిటల్ వేదికలు వారికి తోడ్పడుతున్నాయి. వెరసి, 2030 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డిజిటల్ రిటైల్ మార్కెట్‌గా అవతరించబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story