India Economy 2047 : ఇండియాను ఆపే దమ్ము ఎవరికి లేదు.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

India Economy 2047 : ప్రస్తుతం 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థతో, భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద దేశంగా ఉంది. ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా మారుతున్న భారతదేశం.. 2047 నాటికి 30-35 లక్షల కోట్ల డాలర్ల (35 ట్రిలియన్ డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన, సంపన్న దేశంగా మార్చకుండా ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు అని ఆయన అన్నారు. బలమైన దేశీయ వృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, విస్తరిస్తున్న అంతర్జాతీయ వ్యాపార భాగస్వామ్యాల కారణంగా ఈ లక్ష్యం సాధ్యమవుతుందని గోయల్ వివరించారు.
ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో మాట్లాడిన గోయల్, అధిక నాణ్యత గల ఉత్పత్తులు, సేవలు, సమయానికి వాటిని అందించాలనే భారత్ నిబద్ధత కారణంగా ప్రపంచ దేశాలు విశ్వాసంతో చూస్తున్నాయని తెలిపారు. దేశం స్థిరమైన వృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చాయి.
అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. వస్తువులు, సేవల ఎగుమతులు 4-5 శాతం పెరుగుతాయని అంచనా వేశారు. తక్కువ పన్ను విధానం, బలమైన సంస్థలు, డిజిటల్ పరివర్తన ఈ వేగాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
