Indian Economy : భారత్ వృద్ధి చూసి ప్రపంచం షాక్.. 7% అంటే మామూలు కాదు
7% అంటే మామూలు కాదు

Indian Economy : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ మరింత సానుకూల వ్యాఖ్యలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7%కి చేరువలో ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రభుత్వ స్థిరమైన విధానాలు, పటిష్టమైన దేశీయ అంశాలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇండియా మెరిటైమ్ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఆటుపోట్లకు భారత స్థూల ఆర్థిక వ్యవస్థ స్పందించిన తీరు సంతృప్తికరంగా ఉందని వి. అనంత నాగేశ్వరన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ నిరోధక శక్తితో పాటు, ప్రభుత్వ ఆర్థిక చర్యలు వృద్ధి మార్గాన్ని స్థిరంగా ఉంచాయని ఆయన పేర్కొన్నారు.
2025-26లో భారత జీడీపీ 7%కి చేరువగా వృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులకు భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా స్పందించింది. ఆదాయపు పన్ను , జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటి చర్యలు వృద్ధి వేగాన్ని పెంచాయి. 2025-26లో జీడీపీ 7%కి చేరువలో వృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
ప్రపంచ బ్యాంక్, IMF వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా భారతదేశ ఆర్థిక వృద్ధిపై తమ అంచనాలను పెంచాయి. మూడు ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారతదేశానికి సానుకూల గ్రేడింగ్ ఇచ్చాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రేటింగ్ ఏజెన్సీల నుండి భారతదేశం త్వరలోనే 'A' గ్రేడ్ రేటింగ్‌ను పొందే అవకాశం ఉంది.
కొన్ని నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ చర్యలను ప్రకటించినప్పుడు, చాలా మంది భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టం జరుగుతుందని అంచనా వేశారు. 2025-26లో జీడీపీ 6.3% లేదా అంతకంటే తక్కువగా వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. అయితే, సంవత్సరంలో రెండవ త్రైమాసికంలో జీడీపీ చూపిన వృద్ధి అనేక మంది అభిప్రాయాన్ని మార్చివేసింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనం.

