India Exports Record : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ఎగుమతుల విషయంలో మన దేశం సరికొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, గడచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు ఆకాశాన్నంటాయి. ఎంతలా అంటే, ప్రతి నిమిషానికి సగటున 15 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, సేవలను మనం ప్రపంచ దేశాలకు విక్రయించాం. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని నిపుణులు కొనియాడుతున్నారు.

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత వస్తువులు, సేవల ఎగుమతులు రికార్డు స్థాయిలో 863.11 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 81.42 లక్షల కోట్లు) చేరుకున్నాయి. గత ఏడాది (2024-25) ఇది 825.26 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే ఎగుమతుల్లో 4.6 శాతం వృద్ధి నమోదైంది. దీనిని మరింత వివరంగా చూస్తే, భారత్ ప్రతిరోజూ సగటున రూ. 22,325 కోట్ల విలువైన ఎగుమతులు చేసింది. ప్రతి గంటకు రూ. 930 కోట్లు, అత్యంత ఆశ్చర్యకరంగా ప్రతి నిమిషానికి రూ. 15.50 కోట్లు మన దేశం నుంచి విదేశాలకు తరలివెళ్లాయి.

వస్తువుల ఎగుమతుల కంటే సేవల ఎగుమతులు ఈసారి అద్భుతమైన పనితీరును కనబరిచాయి. 2024-25లో 387.55 బిలియన్ డాలర్లుగా ఉన్న సేవల ఎగుమతులు, 2025-26 నాటికి 8.71 శాతం పెరిగి 421.32 బిలియన్ డాలర్లకు చేరాయి. ముఖ్యంగా ఐటీ సేవలు, బిజినెస్ సొల్యూషన్స్, ప్రొఫెషనల్ కన్సల్టెన్సీకి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉండటమే దీనికి కారణం. మరోవైపు, వస్తువుల ఎగుమతులు కూడా 0.93 శాతం వృద్ధితో 441.78 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారతీయ ఉత్పత్తులకు క్రేజ్ తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఎగుమతుల రికార్డు భారత జిడిపి వృద్ధికి, విదేశీ మారక నిల్వలకు పెద్ద ఊతాన్ని ఇస్తోంది. ఎగుమతులు పెరగడం వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, రూపాయి విలువ కూడా పటిష్టమవుతుంది. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య కూడా భారత్ తన ఎగుమతుల మార్కెట్‌ను విస్తరించుకోవడం విశేషం. మేక్ ఇన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు వంటి ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో భారత్ ఒక ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఈ డేటా స్పష్టం చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story