Forex Reserves : భారత ఖజానాలోకి డాలర్ల వర్షం.. 45 రోజుల్లోనే రికార్డులు బద్దలు
45 రోజుల్లోనే రికార్డులు బద్దలు

Forex Reserves : దేశంలో విదేశీ మారక నిల్వలకు సంబంధించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక ప్రకారం.. భారత్‌లోకి ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్ల రూపంలో కేవలం 45 రోజుల్లోనే రికార్డు స్థాయిలో నిధులు వచ్చి చేరాయి. 2013 నాటి స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌లో మూడు నెలల్లో వచ్చిన 26 బిలియన్ డాలర్ల రికార్డును ఈసారి కేవలం ఆరు వారాల్లోనే దాటేసినట్లు అంచనా వేసింది. ఆర్‌బీఐ తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల విదేశాల నుండి భారత్‌కు వచ్చే మొత్తం ఇన్ఫ్లో ఏకంగా 80 నుండి 85 బిలియన్ డాలర్లకు చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 17 నాటికి అందించిన సమాచారం ప్రకారం.. దేశంలోకి మొత్తం 20.7 బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి. అందులో ఒక్క FCNR(B) డిపాజిట్ల ద్వారానే 17.4 బిలియన్ డాలర్లు రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ పథకం ముగిసే సమయానికి ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్లు ఏకంగా 65 నుంచి 70 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఎస్‌బీఐ నివేదిక సవరించిన అంచనాలను విడుదల చేసింది. దీనికి తోడు ఓవర్సీస్ ఫారిన్ కరెన్సీ బోరోయింగ్స్ (OFCBs), ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బోరోయింగ్స్ (ECBs) నిధులను కూడా కలుపుకుంటే మొత్తం విదేశీ నిధుల ప్రవాహం 85 బిలియన్ డాలర్లను దాటవచ్చని తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మెచ్యూర్ అయ్యే పాత డిపాజిట్లు ఎక్కువ వడ్డీ రేట్ల కారణంగా మళ్లీ రీ-న్యూ అయ్యే అవకాశం ఉంది.
రూపాయి విలువపై ఎస్‌బీఐ హెచ్చరిక
ఒకవైపు డాలర్ల ప్రవాహం భారీగా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణిస్తుండటంపై ఎస్‌బీఐ రీసెర్చ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫారిన్ కరెన్సీ అసెట్స్ (FCA) జూలై చివరి నాటికి 17 నుంచి 20 బిలియన్ డాలర్లకు పెరుగుతున్నప్పటికీ, రూపాయి పతనాన్ని అడ్డుకోవడంలో ఆర్‌బీఐ జోక్యం సరిపోవడం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆర్‌బీఐ రోజుకు సగటున 14 మిలియన్ డాలర్లు మాత్రమే మార్కెట్లో జోక్యం చేసుకుంటోందని, ఇది మన వద్ద ఉన్న 676 బిలియన్ డాలర్ల ఫోరెక్స్ నిల్వలతో పోలిస్తే చాలా తక్కువ అని ఎస్‌బీఐ వ్యాఖ్యానించింది. అయితే ప్రస్తుత పరిణామాలతో ఆర్థిక సంవత్సరం 2027 నాటికి దేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ 50 బిలియన్ డాలర్ల సర్ ప్లస్ సాధించే అవకాశం ఉందని తెలిపింది.
ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టత
ఇదిలా ఉండగా, ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూన్ నెలలో కేంద్ర బ్యాంక్ ప్రకటించిన డాలర్-ఇన్ఫ్లో స్కీమ్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 32 బిలియన్ డాలర్లు వచ్చాయని ధృవీకరించారు. ఇందులో మెజారిటీ నిధులు ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్ల నుంచే రాగా, పన్ను నిబంధనల మార్పుల వల్ల డెట్ సెక్యూరిటీస్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (FPI) రూపంలో మరొక 7 బిలియన్ డాలర్లు వచ్చాయన్నారు. రూపాయి లభ్యత, మార్కెట్ అస్థిరతను నియంత్రించడానికే ఆర్‌బీఐ పరిమితంగా జోక్యం చేసుకుంటోందని, ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా రెపో రేటు సరిగ్గానే ఉందని ఆయన స్పష్టం చేశారు.

