Indian Economy : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక నష్టాల నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఒకేసారి మూడు ప్రధాన రంగాలపై దృష్టి సారించింది. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను భారీగా పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేయడం, నేషనల్ అసెట్ మోనిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా ఆదాయాన్ని రాబట్టడం ఈ వ్యూహం ముఖ్య లక్ష్యాలు. దీనివల్ల ప్రభుత్వం అదనంగా ఎలాంటి అప్పులు చేయకుండానే మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని భావిస్తోంది.

సవాళ్లు ఉన్నా స్థిరంగా దేశీయ వృద్ధి

పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధనం, ఎరువుల దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల వల్ల చమురు దిగుమతుల బిల్లు భారం భారత్‌పై పడుతోంది. అయినప్పటికీ, దేశీయంగా వస్తువుల వినియోగం బలంగా ఉండటం వల్ల భారత జీడీపీ వృద్ధి రేటు ఏమాత్రం తగ్గడం లేదని ప్రభుత్వ ఉన్నత వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతి త్రైమాసికంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనబరుస్తోందని, విదేశాల నుండి భారతీయులు పంపే నిధుల ప్రవాహం కూడా స్థిరంగా కొనసాగుతోందని అధికారులు వివరించారు.

ఆర్థిక సంస్కరణలు, గ్లోబల్ బాండ్ ఇండెక్స్

భారత క్యాపిటల్ మార్కెట్‌ను మరింత బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్థిక రంగంలో మరిన్ని సంస్కరణలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల భాగ్యస్వామ్యాన్ని పెంచేలా కీలక చర్యలు తీసుకుంది. వడ్డీ ఆదాయం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG), షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG) లపై పన్ను మినహాయింపులు ఇవ్వడంతో పాటు పెట్టుబడి నిబంధనలను సరళతరం చేసింది. ఈ చర్యల ద్వారా గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారత్‌కు ఉన్న స్థానం మరింత బలపడటమే కాకుండా, కాలక్రమేణా ప్రభుత్వం తీసుకునే రుణాల ఖర్చు కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్య లోటు లక్ష్యాలు

ఇటీవల విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత ఆర్థిక వ్యవస్థ 7.1 శాతంగా నమోదు కాగా, ప్రస్తుతానికి అది 7.7 శాతానికి పెరిగింది. అయితే, అంతర్జాతీయ ఇంధన ధరల హెచ్చుతగ్గులు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ రాబోయే కాలానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి సర్దుబాటు చేసింది. అయినప్పటికీ, దిగుమతుల ఖర్చులు పెరిగినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో నిర్దేశించుకున్న 4.3 ద్రవ్య లోటు లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఇందుకోసం పార్లమెంట్ రాబోయే వర్షాకాల సమావేశాలలో అదనపు రుణాలు లేదా అదనపు ఖర్చుల అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇంధన ధరల భారం, సబ్సిడీల ఒత్తిడి

దేశీయ వినియోగదారులను అంతర్జాతీయ చమురు ధరల భారం నుంచి రక్షించడానికి ప్రభుత్వం మార్చి నెలలో పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 10 రూపాయల చొప్పున తగ్గించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1.23 లక్షల కోట్లకు పైగా ఆదాయ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత మే నెలలో ఇంధన ధరలను లీటరుకు రూ.7.50 చొప్పున పెంచినప్పటికీ, ప్రస్తుతం విక్రయిస్తున్న ధరలు అసలు వ్యయం కంటే తక్కువగా ఉండటం వల్ల ఆయిల్ కంపెనీలకు రోజుకు దాదాపు రూ.650 కోట్ల నష్టం వస్తోంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరగడంతో, ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ కేటాయింపులను 100 శాతం పెంచాలని కోరింది. బడ్జెట్‌లో దీనికోసం ఇప్పటికే రూ.1.71 లక్షల కోట్లు కేటాయించారు.

ఆస్తుల అమ్మకం ద్వారా బడ్జెట్ అంచనాలకు పైగా ఆదాయం

పెట్టుబడుల ఉపసంహరణ విభాగం (DIPAM), ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (DPE) సంయుక్తంగా ఇన్వెస్టిమెంట్, అసెట్ మోనిటైజేషన్ కోసం ఒక పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేశాయి. బడ్జెట్‌లో ఈ విభాగం ద్వారా నిర్దేశించుకున్న రూ.80,000 కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాలను విక్రయించే ప్రక్రియ వేగంగా ముందుకు సాగనుంది. అలాగే, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఇచ్చిన తర్వాత పలు అంతర్జాతీయ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అనేది రాష్ట్రాలు కౌన్సిల్ ముందు ప్రతిపాదనలు ఉంచే సమయాన్ని బట్టి ఉంటుందని, త్వరలోనే జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రక్రియలపై కీలక చర్చ జరగనుందని సమాచారం.

PolitEnt Media

PolitEnt Media

Next Story