Metro : రికార్డు క్రియేట్ చేసిన మెట్రో.. ప్రతి రోజూ 1.12కోట్ల మంది ప్రయాణం
ప్రతి రోజూ 1.12కోట్ల మంది ప్రయాణం

Metro : ఒకప్పుడు కొన్ని నగరాలకే పరిమితమైన మెట్రో రైల్ ఇప్పుడు భారతదేశంలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాన్ని తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌ను భారత్ నిర్మించింది. 2014లో కేవలం 5 నగరాల్లో 248 కిలోమీటర్ల నెట్‌వర్క్ ఉండగా, మే 2025 నాటికి అది 23 నగరాలకు, 1,013 కిలోమీటర్ల నెట్‌వర్క్‌కు పెరిగింది. ఈ విస్తరణతో మెట్రో, నగరాల్లోని ప్రజలకు లైఫ్‌లైన్‌గా మారింది.
గత దశాబ్దంలో భారతదేశంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందాయి. ఈ ప్రాజెక్టుల వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతోంది. మెట్రో నెట్‌వర్క్ విస్తరణ వల్ల ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2013-14లో రోజుకు 28 లక్షల మంది ప్రయాణికులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 1.12 కోట్లకు చేరింది. ఈ గణాంకాలు మెట్రో ప్రజా రవాణాలో ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందో తెలియజేస్తున్నాయి.
2014కు ముందు నెలకు కేవలం 0.68 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణం జరిగేది. ఇప్పుడు అది నెలకు దాదాపు 6 కిలోమీటర్లకు పెరిగింది. బడ్జెట్ కేటాయింపులు కూడా 2013-14లో రూ.5,798 కోట్ల నుంచి 2025-26లో రూ.34,807 కోట్లకు పెరిగాయి. మెట్రో రైల్ పాలసీ (2017 పాలసీ మెట్రో ప్రాజెక్టులకు వేగం పెంచింది. దీని ప్రకారం, నగరాలు సమగ్ర మొబిలిటీ ప్లాన్, అర్బన్ మెట్రో ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) ఏర్పాటు చేయడం తప్పనిసరి.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద 75% మెట్రో కోచ్‌లు, 25% పరికరాలు దేశంలోనే తయారు చేయడం తప్పనిసరి. బిఇఎమ్‌ఎల్ (BEML) ఇప్పటివరకు 2,000కు పైగా మెట్రో కోచ్‌లను సరఫరా చేసింది.
కొత్త సాంకేతిక ఆవిష్కరణలు
అండర్ వాటర్ మెట్రో: కోల్‌కతాలో హుగ్లీ నది కింద 520 మీటర్ల పొడవైన టన్నెల్ నిర్మిస్తున్నారు.
వాటర్ మెట్రో: కొచ్చిలో ఎలక్ట్రిక్-హైబ్రిడ్ బోట్లతో వాటర్ మెట్రో నడుస్తోంది.
పర్యావరణ అనుకూలత: సౌరశక్తి స్టేషన్లు, రిజనరేటివ్ బ్రేకింగ్, ఐజీబీసీ సర్టిఫైడ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.
భవిష్యత్తు ప్రణాళికలు
రాబోయే రోజుల్లో పుణే మెట్రో దశ-2, ఢిల్లీ మెట్రో విస్తరణ, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, బెంగళూరు మెట్రో దశ-3 వంటి ప్రాజెక్టులు వేగవంతం కానున్నాయి. అలాగే 24 నగరాల్లో వాటర్ మెట్రో ప్రాజెక్టులు కూడా ప్రతిపాదించబడ్డాయి. 2030 నాటికి దేశంలోని మెట్రో నెట్‌వర్క్ మరింత విస్తరించి, భారతీయ నగరాల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుంది.
