మన దగ్గర ఎన్ని రోజుల నిల్వలున్నాయి?

Oil Reserves : ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు వచ్చినా లేదా అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోయినా.. దేశం అంధకారంలో మునిగిపోకుండా ఉండేందుకు ప్రతి దేశం కొంత మేర ముడి చమురును నిల్వ చేసుకుంటుంది. దీనినే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు. ఒకవేళ విదేశాల నుంచి చమురు దిగుమతులు నిలిచిపోతే, భారత్ ఎన్ని రోజులు నెట్టుకురాగలదు? మన దగ్గర ఎంత స్టాక్ ఉంది? అనే విషయాలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పార్లమెంటులో కీలక వివరాలు వెల్లడించారు.

మన దగ్గర ఉన్న చమురు నిల్వలు ఎంత?

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు దేశ అవసరాలకు సుమారు 74 రోజులకు సరిపోతాయి. వీటిని భూగర్భంలోని భారీ గుహలలో భద్రపరుస్తారు. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు, ఉడుపితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ నిల్వలను 90 రోజులకు (3 నెలలకు) పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి?

చమురు భద్రత విషయంలో ఒక్కో దేశం ఒక్కో వ్యూహాన్ని అనుసరిస్తోంది. యూరోపియన్ యూనియన్ దేశాలు కనీసం 90 రోజుల నిల్వలు ఉండాలని రూల్ పెట్టుకున్నాయి. ఈ విషయంలో జపాన్ అందరికంటే ముందుంది. అక్కడ ఏకంగా 224 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. అందుకే అత్యవసర సమయంలో ఇతర దేశాలకు చమురు అమ్మి ఆదుకునే స్థితిలో జపాన్ ఉంది. ఇజ్రాయెల్‌కు అపారమైన చమురు నిల్వలు లేకపోయినా, అమెరికాతో ఒక ఒప్పందం ఉంది. ఏదైనా యుద్ధం లేదా ముప్పు వస్తే ఇజ్రాయెల్‌కు ఏకంగా 5 ఏళ్ల పాటు చమురు సరఫరా చేస్తానని అమెరికా హామీ ఇచ్చింది. మన పొరుగు దేశం పాకిస్థాన్ దగ్గర కేవలం 20 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి.

చమురు శుద్ధిలో భారత్ అగ్రస్థానం

భారతదేశం ముడి చమురు దిగుమతి చేసుకోవడంలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. అలాగే ముడి చమురును శుద్ధి చేయడంలో మనం నాలుగవ స్థానంలో ఉన్నాము. ఏడాదికి సుమారు 260 MMT చమురును మన దేశంలో శుద్ధి చేస్తారు. ఇలా తయారైన పెట్రోలియం ఉత్పత్తులను మనం సొంతానికి వాడుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. పెట్రోలియం ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉండటం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా లేదా సరఫరాలో ఆటంకాలు కలిగినా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ రక్షణ కవచంలా పనిచేస్తాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని చమురు నిల్వ కేంద్రాలు దక్షిణ భారతానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి మరిన్ని కొత్త నిల్వ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story