ఇక అక్కడ నుంచే క్రూడాయిల్

India Oil Import : భారతదేశం తన ఇంధన అవసరాల కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించి, అమెరికా, వెనిజులా వైపు మొగ్గు చూపాలని కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికాతో కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త వాణిజ్య ఒప్పందం ప్రకారం.. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేస్తుందని అమెరికా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే భారత్ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. కేవలం ఇంధన భద్రత, వివిధ దేశాల నుంచి చమురు సేకరించడం తమ ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే స్పాట్ మార్కెట్‌లో టెండర్లు జారీ చేసేటప్పుడు అమెరికా చమురు గ్రేడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని రిఫైనరీలకు సూచించింది.

అమెరికా నుంచి చమురు కొనడం అంత సులభం కాదు. దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అమెరికా ముడి చమురు లైట్ అండ్ స్వీట్ (తక్కువ సల్ఫర్) రకానికి చెందింది. కానీ భారతీయ రిఫైనరీలు ఎక్కువగా మధ్యస్థ లేదా భారీ గ్రేడ్ చమురును శుద్ధి చేయడానికి రూపొందించబడ్డాయి. కాబట్టి అన్ని రిఫైనరీలకు ఇది సెట్ అవ్వదు. అమెరికా నుంచి సముద్ర మార్గం చాలా దూరం కావడంతో ఓడల రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. ఇది ఆయిల్ ధరపై ప్రభావం చూపుతుంది. కజకిస్తాన్ లేదా పశ్చిమ ఆఫ్రికా దేశాలతో పోలిస్తే అమెరికా చమురు ఖరీదైన ఆప్షన్ అవుతుంది.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఇప్పటికే వెనిజులా నుంచి సుమారు 40 లక్షల బారెల్స్ ముడి చమురును కొనుగోలు చేశాయి. వెనిజులా చమురులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. అది చాలా భారీగా ఉంటుంది. అయితే ప్రైవేట్ ట్రేడర్ల ద్వారా ఈ కొనుగోళ్లు జరపాలని భారత్ భావిస్తోంది. ఏటా సుమారు 2 కోట్ల టన్నుల అమెరికా చమురును దిగుమతి చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్ తన విదేశాంగ విధానంలో ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, అంతర్జాతీయ ఆంక్షల మధ్య అమెరికాతో సంబంధాలను కాపాడుకుంటూనే, తన అవసరాలకు సరిపడా చమురును తక్కువ ధరకే దక్కించుకోవాలని భారత్ చూస్తోంది. రాబోయే రోజుల్లో రష్యా నుంచి దిగుమతులు పూర్తిగా ఆగిపోతాయా లేక కేవలం వాటా తగ్గుతుందా అనేది వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story