Trump Tariff : భారతదేశంపై ట్రంప్ ప్రభావం? ఫార్మా రంగంపై పడనున్న 200% పన్నుల భారం
ఫార్మా రంగంపై పడనున్న 200% పన్నుల భారం

Trump Tariff : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే, ఆయన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా, మందులు, వైద్య పరికరాలపై ఏకంగా 200% పన్ను విధించాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రభావం అమెరికాకు మందులు సరఫరా చేసే భారతదేశం వంటి దేశాలపై తీవ్రంగా పడనుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ నుంచి భారతదేశాన్ని మినహాయించినప్పటికీ, భవిష్యత్తులో దీని ప్రభావం మన దేశ ఎగుమతులపై కూడా పడొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
200% పన్నులతో అమెరికాకు కూడా నష్టమే
ట్రంప్ పరిపాలన దిగుమతి చేసుకునే మందులపై భారీ సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. దీనివల్ల అమెరికాలో కూడా మందుల ధరలు విపరీతంగా పెరిగి, స్టాక్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అమెరికా మందుల సరఫరా కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ విధానం వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతిని, అక్కడి ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడవచ్చు. అందువల్ల ఈ ప్లాన్ కేవలం ఎగుమతిదారులకే కాకుండా, అమెరికాకు కూడా తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తుంది.
భారతదేశ ఎగుమతులపై ప్రభావం
ట్రేడ్ ఎకనామిక్స్ గణాంకాల ప్రకారం.. 2024లో భారతదేశం అమెరికాకు 8.72 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఒకవేళ ట్రంప్ విధించాలనుకున్న పన్నులు భారతదేశంపై కూడా అమలైతే, మన దేశం అమెరికాకు చేసే ఫార్మా, ఆర్గానిక్ కెమికల్స్, వైద్య పరికరాల ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.
ఆర్గానిక్ కెమికల్స్ విషయంలో.. భారతదేశం అమెరికాకు 2.56 బిలియన్ డాలర్ల విలువైన కెమికల్స్ ఎగుమతి చేయగా, అమెరికా నుంచి 3.54 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ఇక వైద్య పరికరాల విషయానికొస్తే, భారత్ అమెరికా నుంచి దాదాపు 5.7 బిలియన్ డాలర్ల విలువైన అత్యున్నత స్థాయి వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటుంది. ట్రంప్ విధించే పన్నులు మన ఎగుమతులపై పడితే, ఆ ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతాయి.
