Oil Exploration : ఆయిల్ దిగుమతులకు చెక్.. సముద్రంలో ముడి చమురు వేటకు రూ.80,000 కోట్ల ప్యాకేజ్
రూ.80,000 కోట్ల ప్యాకేజ్

Oil Exploration : దేశీయంగా ముడి చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా విదేశాల నుంచి దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలని భారత ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా సముద్ర గర్భంలో ముడి చమురు, సహజ వాయువు నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ దాదాపు రూ.80,000 కోట్ల భారీ ఇన్సెంటివ్ ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. నేషనల్ డీప్‌వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ లేదా సముద్ర మంథన్ పేరుతో రూపొందిస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా గ్లోబల్ ఆయిల్ దిగ్గజాలను, విదేశీ పెట్టుబడులను భారత్‌వైపు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
సగం ఖర్చు ప్రభుత్వానిదే.. ఆఫర్ అదిరింది
సముద్రంలో చమురు నిల్వల కోసం జరిపే అన్వేషణలో ఉండే ఆర్థిక రిస్క్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత ప్యాకేజీ ప్రకారం, సముద్రంలో లోతైన ప్రాంతాలలో బావులు తవ్వడానికి అయ్యే ఖర్చులో ఏకంగా 50 శాతాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఈ ఆఫర్ ద్వారా అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికత కలిగిన బహుళజాతి కంపెనీలు భారత్‌లో రీసెర్చ్, డ్రిల్లింగ్ చేయడానికి ముందుకు వస్తాయని ఆశిస్తున్నారు. కాగా, ఈ ప్రతిపాదనపై వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే క్యాబినెట్ ఆమోదం కోసం పంపనున్నారని సమాచారం.
సముద్రంలో బావి తవ్వాలంటే వెయ్యి కోట్లకు పైనే
సముద్ర గర్భంలో ఉండే సంక్లిష్ట భూభౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడ ఒక అన్వేషణ బావిని తవ్వడానికి కనీసం రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుంది. కొన్ని అత్యంత లోతైన ప్రదేశాల్లో అయితే ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశముంది. ఇంతటి భారీ వ్యయంతో కూడుకున్న పని కావడంతో విదేశీ కంపెనీలు ఇప్పటివరకు భారత్‌లో ఆయిల్ వేటకు ముందుకు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వమే 50 శాతం నిధులు సమకూరుస్తుండటంతో, ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీతో పాటు ప్రైవేట్ దిగ్గజాలకు కూడా పెద్ద ఊరట లభించినట్లయింది. శనివారం రోజున ఓఎన్జీసీ ఈ మిషన్ కింద తన మొదటి డీప్‌వాటర్ బావి తవ్వకాన్ని కూడా ప్రారంభించింది.
18 బ్లాక్‌లకు వేలం పాట.. సెప్టెంబర్ 17 ఆఖరు తేదీ
ఈ భారీ ప్యాకేజీతో పాటు ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ (OALP) కింద 18 డీప్‌వాటర్, ఆల్ట్రా డీప్‌వాటర్ బ్లాక్‌ల వేలాన్ని కేంద్రం ఇప్పటికే చేపట్టింది. ఈ బిడ్డింగ్‌కు సెప్టెంబర్ 17వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. ఆలోపే ఈ రూ.80,000 కోట్ల ఇన్సెంటివ్ ప్యాకేజీకి తుది రూపునిచ్చి అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు. పాత జియోలాజికల్ డేటాను అధునాతన టెక్నాలజీతో రీ-ప్రాసెస్ చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలను రంగంలోకి దించుతున్నారు. ఈ కొత్త విధానంతో భారతదేశ ఇంధన భద్రత సరికొత్త మలుపు తిరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

