Semiconductor : భారత సెమీకండక్టర్ చిప్‌ల హవా.. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల బిజినెస్
2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల బిజినెస్

Semiconductor : భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగి 100-110 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పరిశ్రమ అంచనాల ప్రకారం, 2023లో దాదాపు 38 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత సెమీకండక్టర్ మార్కెట్, 2024-2025లో 45-50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు 2030 నాటికి భారీ వృద్ధిని సాధించబోతోంది. ప్రస్తుతం తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలు సెమీకండక్టర్ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ముఖ్యంగా తైవాన్ ప్రపంచంలో 60% కంటే ఎక్కువ సెమీకండక్టర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అత్యంత అడ్వాన్సుడ్ సెమీకండక్టర్లలో దాదాపు 90% తైవాన్ నుంచే వస్తున్నాయి.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ దేశాలపై ఆధారపడటం వల్ల, వాహన పరిశ్రమ వంటి అనేక రంగాల్లో సంక్షోభం ఎదురైంది. దీంతో ప్రపంచ సరఫరా గొలుసులో భారత్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇలా ఒకే ప్రాంతంపై ఆధారపడటం వల్ల ప్రపంచ సరఫరా గొలుసులకు మహమ్మారి, ప్రకృతి వైపరీత్యాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వంటి అనేక తీవ్రమైన ప్రమాదాలు ఎదురవుతున్నాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ సవాళ్లను అర్థం చేసుకున్న చాలా దేశాలు ఇప్పుడు సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తమ దేశీయ చిప్ తయారీకి మద్దతు ఇవ్వడానికి, ఒకే ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కొత్త వ్యూహాలను ప్రారంభించాయి. ఈ ప్రపంచ మార్పులో భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2030 నాటికి ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ ఒక లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో భారత మార్కెట్ ఒక పెద్ద వాటాను కలిగి ఉండనుంది. సెమీకండక్టర్ తయారీ సరఫరా గొలుసులోని మూడు ప్రధాన స్తంభాలలో - పరికరాలు, పదార్థాలు, సేవలు, పరిశోధన అభివృద్ధి - భారత్ ఒక ప్రధాన భాగస్వామిగా ఎదిగే కెపాసిటీ ఉంది. ఈ పెరుగుదల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
