Smartphone : స్మార్ట్‌ఫోన్ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.. ప్రతి నాలుగో ఫోన్ మన దేశీ కంపెనీదే
ప్రతి నాలుగో ఫోన్ మన దేశీ కంపెనీదే

Smartphone : భారతదేశం కేవలం స్మార్ట్‌ఫోన్ల వినియోగంలోనే కాదు, తయారీలోనూ ప్రపంచానికి దిక్సూచిగా మారుతోంది. ఒకప్పుడు విదేశీ బ్రాండ్ల హవా నడిచిన ఈ రంగంలో, ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్లు జైత్రయాత్ర సాగిస్తున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. దేశంలో తయారవుతున్న ప్రతి నాలుగు ఫోన్లలో ఒకటి మన దేశీ కంపెనీల నుంచే వస్తోంది. అంటే మొత్తం ఉత్పత్తిలో 25 శాతం వాటాను భారతీయ తయారీదారులు కైవసం చేసుకున్నారు. ఎగుమతుల్లోనూ సరికొత్త రికార్డులు సృష్టించడం విశేషం.
నెంబర్-1 స్థానంలో డిక్సన్ టెక్నాలజీస్
భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో డిక్సన్ టెక్నాలజీస్ అద్భుతాలు చేస్తోంది. 2025 నాటికి ఈ కంపెనీ శాంసంగ్‌ను కూడా వెనక్కి నెట్టి భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా అవతరించింది. ప్రస్తుతం 19 శాతం మార్కెట్ వాటాతో డిక్సన్ అగ్రస్థానంలో ఉంది. మోటోరోలా, రియల్‌మీ, షావోమీ వంటి గ్లోబల్ బ్రాండ్ల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతో డిక్సన్ ఉత్పత్తి ఏకంగా 89 శాతం పెరిగింది. ఇది భారతీయ కంపెనీల సత్తాకు నిదర్శనం.
ఎగుమతులే గ్రోత్ ఇంజిన్
భారతదేశ స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం వృద్ధికి ఎగుమతులు ప్రధాన కారణం. 2025లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 28 శాతం పెరిగాయి. దేశంలో తయారయ్యే ఫోన్లలో మూడో వంతు విదేశాలకు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఆపిల్ ఫోన్ల తయారీ వల్ల ఫాక్స్‌కాన్ తన వాటాను 16 శాతానికి పెంచుకుంది. అయితే, శాంసంగ్ తన ఎగుమతుల వేగాన్ని అందుకోలేక 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోయింది. విదేశీ మార్కెట్లలో భారతీయ తయారీ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.
భగవతి ప్రొడక్ట్స్, చైనా భాగస్వామ్యం
దేశీ కంపెనీ అయిన భగవతి ప్రొడక్ట్స్ (మైక్రోమ్యాక్స్ భాగస్వామ్యం) 9 శాతం వాటాతో టాప్-5 లో చోటు దక్కించుకుంది. చైనాకు చెందిన హువాకిన్ టెక్నాలజీస్‌తో జతకట్టడం ఈ కంపెనీకి బాగా కలిసివచ్చింది. వివో, ఒప్పో వంటి చైనా బ్రాండ్లు ఇప్పుడు తమ ఫోన్లను భారతీయ కంపెనీల ద్వారానే తయారు చేయిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం నిఘా పెంచడంతో, చైనా కంపెనీలు భారతీయ సంస్థలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసి ఇక్కడే ఫోన్లను తయారు చేయిస్తున్నాయి.
ప్రభుత్వ విధానాల ఊతం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ ఈ భారీ మార్పుకు నాంది పలికింది. విదేశీ పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడం, స్థానిక తయారీకి రాయితీలు ఇవ్వడం వల్ల దేశీ కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. 2026లో కూడా ఎగుమతులే భారత స్మార్ట్‌ఫోన్ రంగాన్ని నడిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ యుద్ధాలు, మెమరీ చిప్‌ల ధరల పెరుగుదల వంటి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారతీయ కంపెనీల జోరు తగ్గేలా లేదు.

