National Honey Mission : స్వీట్ రివల్యూషన్ దిశగా భారత్..తేనెటీగల పెంపకానికి కేంద్రం రూ.500 కోట్లు
National Honey Mission : దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా తేనెకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో భారతదేశం ఇప్పుడు స్వీట్ రివల్యూషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

National Honey Mission : దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా తేనెకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో భారతదేశం ఇప్పుడు స్వీట్ రివల్యూషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తేనె ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ (NBHM) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమం రైతులకు, వ్యవసాయ కార్మికులకు లాభదాయకమైన వృత్తిగా మారుతోంది. ఈ ప్రోత్సాహకాల ఫలితంగా, ప్రపంచంలో అత్యధిక తేనె ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్ 2020లో 9వ స్థానం నుండి ఇప్పుడు 2వ స్థానానికి ఎగబాకడం గమనార్హం.
భారతదేశంలో తేనె ఉత్పత్తిని పెంచి, దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ను అమలు చేస్తోంది. నేషనల్ బీ బోర్డ్ ద్వారా 2020-21లో రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం మూడు సంవత్సరాల కాలానికి ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ పథకాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగించారు. అంటే, ఈ తేనెటీగల పెంపకం పథకం మార్చి 31, 2026 వరకు అమలులో ఉంటుంది. శాస్త్రీయ పద్ధతులలో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా తేనె ఉత్పత్తిలో స్వయం-సమృద్ధిని సాధించడం. తేనెటీగల పెంపకం కేవలం తేనె ఉత్పత్తికే కాకుండా, వ్యవసాయ రంగంలో కూడా రైతులకు ఎంతో మేలు చేస్తుంది. తేనెటీగలు పరాగ సంపర్కం ప్రక్రియకు సహాయపడతాయి. దీని వలన పంటల దిగుబడి పెరుగుతుంది. అందుకే తేనెటీగలను రైతు స్నేహపూర్వక కీటకాలుగా పరిగణిస్తారు.
తేనెటీగల పెంపకం ప్రస్తుతం గ్రామీణ ప్రజలకు, రైతులకు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు లాభదాయకమైన ప్రధాన ఉప-వృత్తిగా మారింది. తేనెతో పాటు ప్రొపోలిస్ గమ్, తేనెటీగల విషం, రాయల్ జెల్లీ వంటి ఇతర తేనెగూడు ఉత్పత్తులను కూడా ఎగుమతి చేసి అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. నేషనల్ బీ కీపింగ్ మిషన్ను సమర్థవంతంగా అమలు చేయడానికి మూడు ఉప-మిషన్లుగా విభజించారు. వివిధ పంటల ఉత్పత్తిని మెరుగుపరచడానికి శాస్త్రీయ పద్ధతుల్లో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడం. తేనె ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలపై దృష్టి సారించడం. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం. ఆయా ప్రాంతాల వాతావరణ, సామాజిక-ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, సరైన తేనెటీగల పెంపకం పద్ధతులను అభివృద్ధి చేయడానికి సాంకేతిక అభివృద్ధి మీద దృష్టి పెట్టడం.
కేంద్రం ఈ ప్రోత్సాహకాలు, భారతదేశంలో ఉన్న విభిన్న వ్యవసాయ వాతావరణం కారణంగా తేనె ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధించింది. 2020లో ప్రపంచంలో అత్యధిక తేనె ఎగుమతి చేసే దేశాలలో 9వ స్థానంలో ఉన్న భారతదేశం, ప్రస్తుతం 2వ స్థానానికి ఎగబాకింది. 2024లో భారతదేశం 1.4 లక్షల మెట్రిక్ టన్నుల సహజమైన తేనెను ఉత్పత్తి చేసింది. అలాగే 2023-24లో 1.07 లక్షల మెట్రిక్ టన్నుల తేనెను విదేశాలకు ఎగుమతి చేసింది.

