United Spirits : తాగేటోళ్లకు ఎంతో ఇష్టమైన బ్రాండ్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన లిక్కర్ దిగ్గజం
లాభాల పంట పండించిన లిక్కర్ దిగ్గజం

United Spirits : దేశంలోనే అతిపెద్ద లిక్కర్ కంపెనీ, నంబర్-1 విస్కీ తయారీ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(USL) ఆర్థిక సంవత్సరం 2027 తొలి త్రైమాసికంలో ఊహించని రేంజ్‌లో బంపర్ ప్రాఫిట్స్ కొల్లగొట్టింది. డయాజియో యాజమాన్యంలోని ఈ కంపెనీ జూన్ త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో ఏకంగా 51.55 శాతం నికర లాభాల వృద్ధి నమోదు చేసి రూ.391 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.258 కోట్లుగా మాత్రమే ఉండటం విశేషం. జూన్ క్వార్టర్‌లో ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా 4.98 శాతం పెరిగి రూ.6,113 కోట్లకు చేరింది.
విక్రయాల జోరు... పెరిగిన ఆదాయం
యూఎస్ఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్ వివరాల ప్రకారం.. కంపెనీ మొత్తం ఆదాయం గతేడాది కంటే 7.66 శాతం పెరిగి రూ.6,335 కోట్లకు చేరుకుంది. ఇక కంపెనీ నెట్ సేల్స్ వాల్యూ కూడా 6 శాతం పెరిగి రూ.2,703 కోట్లను తాకింది. అయితే, వ్యాపార విస్తరణ, ముడిసరుకుల ఖర్చులు పెరగడంతో జూన్ త్రైమాసికంలో కంపెనీ చేసిన మొత్తం వ్యయం 4.63 శాతం పెరిగి రూ.5,781 కోట్లకు చేరినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.
ప్రెస్టీజ్ & అబోవ్ సెగ్మెంట్ హవా
లిక్కర్ ప్రియులు ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో ప్రెస్టీజ్ అండ్ అబోవ్ విభాగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ సెగ్మెంట్ డబుల్ డిజిట్‌లో అంటే ఏకంగా 10.1 శాతం రికార్డు వృద్ధిని కనబరిచింది. మొత్తం నెట్ సేల్స్‌లో కేవలం ఈ ప్రీమియం బ్రాండ్ల వాటాయే 91.7 శాతంగా ఉండటం కంపెనీకి కలసివచ్చింది. ప్రముఖ స్మిర్నాఫ్ బ్రాండ్‌లో తెచ్చిన కొత్త లోకల్ ఫ్లేవర్లు, ప్రీమియం విస్కీ బ్రాండ్ల సేల్స్ కంపెనీకి కాసుల వర్షం కురిపించాయని సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్ తెలిపారు.
కొన్ని రాష్ట్రాల విధానాల వల్ల నెమ్మదించిన పాపులర్ సెగ్మెంట్
ఒకవైపు ప్రీమియం బ్రాండ్లు దుమ్మురేపినా, సాధారణ పాపులర్ సెగ్మెంట్ అమ్మకాలు మాత్రం 17.5 శాతం తగ్గి రూ.206 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీ మార్పులు, ట్యాక్స్ స్లాబుల సవరణ వల్ల సాధారణ మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. ప్రైసింగ్ విధానాల వల్ల అమ్మకాలు కాస్త తగ్గినప్పటికీ, ఓవరాల్ సేల్స్‌లో ప్రీమియం ఉత్పత్తులు కంపెనీని మంచి లాభాల్లో నిలబెట్టాయి. బిఎస్‌ఇలో యూఎస్ఎల్ షేరు ధర ప్రస్తుతం రూ. 1,404.60 వద్ద ట్రేడ్ అవుతోంది.

