4.7 శాతానికి చేరిన రేటు, మహిళల భాగస్వామ్యం బేష్

Unemployment Rate : భారతదేశంలో ఉద్యోగాల విషయంలో శుభవార్త వినిపించింది. 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు నవంబర్ 2025లో రికార్డు స్థాయిలో తగ్గి 4.7 శాతానికి చేరుకుంది. అక్టోబర్ 2025లో ఇది 5.2 శాతం ఉండేది. కేంద్రం విడుదల చేసిన ఈ డేటా ప్రకారం.. ఏప్రిల్ 2025 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. మొత్తం మీద ఈ గణాంకాలు భారతదేశ కార్మిక మార్కెట్ పరిస్థితి బలోపేతం అవుతోందని, ముఖ్యంగా గ్రామీణ ఉపాధి పెరుగుదల, మహిళల భాగస్వామ్యం మెరుగుపడటం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నాయి.

నిరుద్యోగం రేటు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గణనీయంగా తగ్గింది. నవంబర్ 2025లో గ్రామీణ నిరుద్యోగం రేటు తగ్గి 3.9 శాతానికి చేరుకోగా, ఇది కొత్త కనిష్ట స్థాయి. పట్టణ నిరుద్యోగం రేటు కూడా తగ్గి 6.5 శాతానికి చేరింది. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ నిరుద్యోగం రేటు తగ్గడం సానుకూల అంశం. మహిళల్లో నిరుద్యోగం రేటు 5.4 శాతం నుంచి 4.8 శాతానికి, పురుషుల్లో 5.1 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగం రేటు ఏకంగా 4 శాతం నుంచి 3.4 శాతానికి పడిపోవడం విశేషం.

నిరుద్యోగ రేటు తగ్గడంతో పాటు, కార్మిక శక్తిలో భాగస్వామ్యం కూడా పెరిగింది. 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (Labour Force Participation Rate) నవంబర్ 2025లో 55.8 శాతానికి పెరిగింది. ఇది ఏప్రిల్ 2025 తర్వాత అత్యధిక స్థాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలే. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (Women Population Ratio) కూడా బాగా మెరుగుపడి, నవంబర్ 2025 నాటికి 38.4 శాతానికి చేరింది. ఈ గణాంకాలు మొత్తం మహిళా LFPR లో గణనీయమైన వృద్ధిని (32.0 శాతం నుంచి 35.1 శాతం) సూచిస్తున్నాయి. ఈ సానుకూల ధోరణి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి మార్కెట్‌కు మంచి సంకేతంగా భావించవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story