ఇక ఈ కరేబియన్ దేశంలో కూడా

UPI : భారత్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అయిన UPI ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా తనదైన గుర్తింపును చాటుకుంటోంది. తాజాగా, కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇకపై అక్కడ ఉన్న ప్రజలు కూడా భారతదేశంలో మాదిరిగానే తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా తక్షణమే డబ్బును పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. భారత్ ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య కుదిరిన ఈ భాగస్వామ్యం భారత సాంకేతిక శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI ) అంతర్జాతీయ విభాగం అయిన NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా UPIని విదేశాలలో ఉపయోగించడం మరింత సులభతరం అవుతుంది. ఈ సహకారంతో రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయి.

UPI అనేది ఒక వినూత్న డిజిటల్ పేమెంట్ సిస్టమ్. దీని ద్వారా ప్రజలు నగదు లేకుండా, కేవలం తమ మొబైల్ ఫోన్ ద్వారా తక్షణమే డబ్బును పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. దీని కోసం ఫోన్‌పే , గూగుల్ పే లేదా భీమ్ వంటి ఏదైనా ఒక మొబైల్ యాప్ ఉంటే సరిపోతుంది. ఇందులో బ్యాంక్ వివరాలు అందించాల్సిన అవసరం ఉండదు, కేవలం ఒక UPI ID తోనే లావాదేవీలు పూర్తి అవుతాయి. ఇది యూజర్-ఫ్రెండ్లీ సిస్టమ్.

ట్రినిడాడ్ అండ్ టొబాగోలో గణనీయమైన సంఖ్యలో భారతీయ మూలాలు ఉన్న ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, ప్రవాస భారతీయులకు పేమెంట్స్ చేయడం ఇక సులువు అవుతుంది. వీరు తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపాలన్నా, లేదా అక్కడి స్థానిక వ్యాపారులతో లావాదేవీలు జరపాలన్నా UPIని ఉపయోగించవచ్చు. దీనితో పాటు, అక్కడి స్థానిక ప్రజలు కూడా ఫాస్ట్ పేమెంట్ల కోసం UPIని ఉపయోగించుకోవచ్చు. ఈ సహకారం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి.

భారత్ UPI ఇంతకుముందు కూడా పలు దేశాలలో తన సేవలను ప్రారంభించింది. సింగపూర్ , యూఏఈ , నేపాల్ , భూటాన్ , ఫ్రాన్స్ , శ్రీలంక, మారిషస్ వంటి దేశాలలో ఇప్పటికే UPI సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగోతో కలిపి మరిన్ని దేశాలు క్రమంగా ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను స్వీకరించడానికి ముందుకు వస్తున్నాయి. దీని వల్ల భారతీయ పౌరులకు విదేశాలలో చెల్లింపులు చేయడం సులభం అవుతుంది. అదే విధంగా విదేశీ పౌరులు కూడా భారత్‌లో సులభంగా పేమెంట్లు చేయగలుగుతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story