ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

Indian Innovation : విమానాలు టేకాఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి తప్పనిసరిగా రన్‌వే అవసరం. రన్‌వే లేకుండా విమానం దిగదు. రన్‌వే లేకుండా దిగే విమానం ఎందుకు ఉండదు అని ఎవరికైనా అనిపించవచ్చు. డ్రోన్ తరహాలో, హెలికాప్టర్ తరహాలో, స్కైఫై సినిమాల్లో వచ్చే ఏలియన్ల స్పేస్‌షిప్‌ల మాదిరిగా విమానాలను ఎందుకు తయారు చేయకూడదు అని కొందరికైనా సందేహం వచ్చి ఉండవచ్చు. ఈ ఆసక్తి, ప్రశ్నలకు భారతీయ శాస్త్రవేత్తలు సమాధానం ఇస్తున్నారు.

ఐఐటీ మద్రాస్ బృందం విమానం నేరుగా, నెమ్మదిగా దిగడానికి వీలైన ఒక టెక్నాలజీని ఆవిష్కరించింది. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ఈ సాంకేతిక ఆవిష్కరణలో నిమగ్నమై ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా చేరడం గర్వకారణం. ఐఐటీ మద్రాస్ బృందం హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్, వర్చువల్ సిమ్యులేషన్ టెక్నాలజీని ఏకీకృతం చేసి, విమానం నేరుగా నిలువుగా దిగడానికి వీలయ్యేలా చేసింది. దీనికి క్లిష్టమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ అవసరం అవుతుంది. ఇక్కడ విమానం లేదా వైమానిక వాహనం దిగేటప్పుడు ఎంత నెమ్మదిస్తుంది. ఎంత మృదువుగా దిగుతుంది అనేది ముఖ్యం. దీనిని సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ శాస్త్రవేత్తలు దీనిని సాధించడం గర్వకారణం.

ప్రస్తుతం నేరుగా ఎగరగల, దిగగల (Vertical Takeoff and Landing) ఫ్లయింగ్ టాక్సీలు ఆవిష్కరించారు. అయితే, వాటి టెక్నాలజీ చాలా క్లిష్టంగా ఉంటుంది. వాటి మెయింటెనెన్స్ కూడా కష్టకరం. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ బృందం ఒక వినూత్న పద్ధతిని అనుసరించి విజయం సాధించింది. ఈ బృందం తమ ప్రయోగ వివరాలను ఒక అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించింది. తాము ఆవిష్కరించిన ఈ సిస్టమ్ టెక్నికలగా ఉపయోగించి, దానిని కమర్షియల్‎గా ఉపయోగించగలిగితే, ఇది ప్రపంచ వైమానిక రంగంలోనే గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఐఐటీ మద్రాస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ పి.ఎ. రామకృష్ణ తెలిపారు.

ప్రస్తుతానికి నేరుగా ఎగరగల, దిగగల వైమానిక వాహనం అంటే హెలికాప్టర్ మాత్రమే. అయితే, దాని వేగం చాలా తక్కువ, మెయింటెనెన్స్ ఖర్చు అధికం, ప్రయాణించే దూరం కూడా తక్కువ. కాబట్టి, ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన టెక్నాలజీ నిజంగా గేమ్ ఛేంజర్‌గా మారుతుంది. ఒకవేళ ఈ టెక్నాలజీ విమానాలకు అమర్చడంలో విజయం సాధిస్తే, వైమానిక రంగ స్వరూపమే మారిపోవచ్చు. విమానాలు ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి రన్‌వేలు అవసరం ఉండదు. కొండలు, అడవులు వంటి ఊహించలేని ప్రదేశాలలో కూడా విమానాలను దించవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story