IndiGo : భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రస్తుతం కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, భవిష్యత్తుపై మాత్రం గట్టి నమ్మకంతో ఉంది. ఆర్థిక సంవత్సరం 2030 నాటికి తన వ్యాపార సామర్థ్యాన్ని ఏకంగా రెట్టింపు చేసుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా ఎదగాలనే పట్టుదలతో అంతర్జాతీయ నెట్‌వర్క్ విస్తరణ, సుదూర ప్రయాణాలు, ప్రీమియం సేవలతో పాటు అదనపు ఆదాయ వనరులపై గట్టిగా దృష్టి పెడుతోంది. సోమవారం జరిగిన ఎనలిస్ట్ డే 2026 వేదికగా ఇండిగో తన ఈ మెగా ప్లాన్‌ను ప్రపంచం ముందుకు తెచ్చింది.

కొన్ని రూట్లు బంద్.. ఎందుకంటే?

ప్రస్తుతం కంపెనీ తన అంతర్జాతీయ రూట్లను మరింత పటిష్టం చేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే రాబోయే జూలై, సెప్టెంబర్ మధ్య కాలంలో తక్కువ డిమాండ్, భారీ నిర్వహణ ఖర్చుల కారణంగా ఆరు అంతర్జాతీయ ప్రాంతాలకు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆగస్టు 31 నుండి మ్యాంచెస్టర్ సర్వీసులను ఆపేయడంతో పాటు, ఎయిర్‌స్పేస్ ఇబ్బందుల వల్ల తాము లీజుకు తీసుకున్న ఆరు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలలో ఒకదానిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండిగో షేర్లు 2.42 శాతం తగ్గి రూ.4,370 వద్ద ట్రేడ్ అయ్యాయి.

20 కోట్ల మంది ప్రయాణికులే లక్ష్యం

ఇండిగో తన విజన్ 2030లో భాగంగా 2026 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 12.3 కోట్ల ప్రయాణికుల సంఖ్యను, 2030 నాటికి 20 కోట్లకు (200 మిలియన్లు) పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. అలాగే ప్రస్తుతం రోజువారీ నడుస్తున్న 2,200 సర్వీసులను 3,000 కు పెంచడంతో పాటు, తమ వద్ద ఉన్న విమానాల సంఖ్యను (ఫ్లీట్) 550 కి పైగా విస్తరించాలని యోచిస్తోంది. తన తక్కువ ధరల పునాదిని దెబ్బతీయకుండానే, అంతర్జాతీయ లాంగ్-హాల్ రూట్లు, ప్రీమియం ట్రావెల్ సెగ్మెంట్, కార్గో ఆపరేషన్లలో తన ముద్ర వేయాలని చూస్తోంది.

కొత్త విమానాలతో గ్లోబల్ మార్కెట్ పై కన్ను

ఇండిగో వృద్ధి వ్యూహంలో అంతర్జాతీయ విస్తరణ అత్యంత కీలకం. 2030 నాటికి తన మొత్తం నెట్‌వర్క్‌లో అంతర్జాతీయ ప్రయాణాల వాటాను 40 శాతానికి చేర్చాలని భావిస్తోంది. ఇందుకోసం ఎయిర్‌బస్ A321XLR, ఎయిర్‌బస్ A350 వైడ్‌బాడీ జెట్ విమానాలను రంగంలోకి దించుతోంది. ఆర్థిక సంవత్సరం 2027లో కంపెనీకి 9 సరికొత్త A321XLR విమానాలు రానున్నాయి. ఇవి దాదాపు 8.5 గంటల పాటు నిరంతరాయంగా ఎగరగలవు. వీటి సహాయంతో భారత్ నుంచి ఎథెన్స్, ఇస్తాంబుల్, బాలి, సియోల్ వంటి ప్రముఖ నగరాలకు నేరుగా సర్వీసులు ప్రారంభించి, ఇంటర్నేషనల్ ట్రాఫిక్‌ను క్యాష్ చేసుకోవాలని ఇండిగో ప్లాన్ చేస్తోంది.

ప్రీమియం సేవలు మరియు ఇతర ఆదాయాలు

కేవలం సాధారణ ప్రయాణికులే కాకుండా, ఇండిగో-స్ట్రెచ్ ద్వారా బిజినెస్ క్లాస్ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సంస్థ సిద్ధమైంది. మార్చి 2027 నాటికి రోజువారీ ప్రీమియం సీట్ల సంఖ్యను 2,800 నుంచి 4,300కి పెంచనున్నారు. దీనితో పాటు కార్గో సామర్థ్యాన్ని 2026 లోని 3.6 లక్షల టన్నుల నుంచి 2030 నాటికి 4.5 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. టికెట్ విక్రయాలే కాకుండా పెయిడ్ సీటింగ్, లగేజ్ ప్రోడక్ట్స్, 1.1 కోట్ల మంది సభ్యులున్న బ్లూచిప్ లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టేందుకు ఒక పటిష్టమైన ఎకోసిస్టమ్‌ను ఇండిగో నిర్మిస్తోంది. రూ. 36,200 కోట్ల ఫ్రీ క్యాష్ బ్యాలెన్స్‌తో ఆర్థికంగా బలంగా ఉన్న ఇండిగో, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులతో మార్కెట్లో అగ్రగామిగా ఎదిగేందుకు అడుగులు వేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story