మిగిలిన కంపెనీలకు దిక్కులేదా?

Aviation Market : భారతీయ గగనతలంలో ఇప్పుడు రెండే రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఇండిగో, రెండోది ఎయిర్ ఇండియా గ్రూప్. దేశీయ విమానయాన రంగంలో పోటీ క్రమంగా తగ్గిపోతూ, ఈ రెండు దిగ్గజాల ఆధిపత్యం పెరిగిపోతోందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సాక్షిగా వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలోని మొత్తం విమాన ప్రయాణాల్లో దాదాపు 91 శాతం వాటా ఈ రెండు సంస్థలదే కావడం విశేషం.కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్స్ గత కొన్నేళ్లుగా తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంటోంది. 2025లో ఈ సంస్థకు 64 శాతం మార్కెట్ వాటా ఉండగా, జనవరి 2026 నాటికి అది 63.6 శాతంగా నమోదైంది. మరోవైపు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా కలిపి దాదాపు 27 శాతం మార్కెట్‌ను ఆక్రమించాయి. అంటే దేశంలో విమానం ఎక్కే ప్రతి 100 మందిలో 91 మంది ఈ రెండు గ్రూపుల విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. మిగిలిన చిన్న చిన్న ఎయిర్‌లైన్స్‌ అన్నీ కలిపి కేవలం 9 శాతం వాటాతో సరిపెట్టుకుంటున్నాయి.

ఇండిగో విమానాల రద్దు

మార్కెట్ వాటా పెరిగినా, సేవల విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2025 డిసెంబరు నెలలో ఇండిగో ఏకంగా 5,689 విమానాలను రద్దు చేసింది. దీనివల్ల దాదాపు 3.64 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైలట్ల షెడ్యూలింగ్‌లో తలెత్తిన లోపాలు, కొత్తగా వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను పాటించడంలో వైఫల్యం చెందడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వం వివరించింది. దీనికి పరిహారంగా ఇండిగో సంస్థ ఇప్పటివరకు సుమారు రూ. 46 కోట్లకు పైగా ప్రయాణికులకు తిరిగి చెల్లించింది.

ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం లేకపోవడంపై విమర్శలు

ఈ సంక్షోభంపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న వేళ ప్రభుత్వంపై కొన్ని ప్రశ్నలు కూడా వెల్లువెత్తాయి. విమానాల రద్దు వల్ల ప్రయాణికులు ఆర్థికంగా ఎంత నష్టపోయారు? లేదా ఎయిర్‌లైన్స్‌కు ఎంత లోటు వచ్చింది? అనే అంశాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వద్ద పూర్తిస్థాయి గణాంకాలు అందుబాటులో లేవు. ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం పొందని వారు ఎంతమంది అనే విషయంపై కూడా అధికారిక రికార్డులు లేకపోవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. మొత్తం మీద ఆకాశంలో పోటీ తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో విమాన టికెట్ల ధరలు సామాన్యుడికి భారంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story