Stock Market Crash: ఇండోనేషియా స్టాక్ మార్కెట్ క్రాష్..1998 తర్వాత అతిపెద్ద పతనం
అతిపెద్ద పతనం

Stock Market Crash: ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విలసిల్లుతున్న ఇండోనేషియా స్టాక్ మార్కెట్ శుక్రవారం దారుణంగా కుప్పకూలింది. గ్లోబల్ ఇండెక్స్ దిగ్గజం MSCI తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ఈ విధ్వంసానికి కారణమైంది. ఇండోనేషియాను ఎమర్జింగ్ మార్కెట్ హోదా నుంచి తొలగించి స్టాండ్అలోన్ కేటగిరీలోకి మార్చనున్నట్లు MSCI హెచ్చరించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే జకార్తా స్టాక్ ఎక్స్ఛేంజ్లో విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లను విక్రయించడం ప్రారంభించారు. ఒకే రోజులో బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏకంగా 11.4 శాతం మేర పడిపోయింది. 1998 ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత ఇండోనేషియా స్టాక్ మార్కెట్ ఎదుర్కొన్న అతిపెద్ద నిమిషాల పతనంగా ఇది నిలిచింది.
ట్రేడింగ్ నిలిపివేత, దిగ్గజ బ్యాంకుల షేర్ల పతనం
శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బెంచ్ మార్క్ ఇండెక్స్ 8 శాతం పడిపోవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యగా 30 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను పూర్తిగా నిలిపివేశారు. ట్రేడింగ్ పునఃప్రారంభమైనప్పటికీ అమ్మకాల ఒత్తిడి తగ్గకపోగా మరింత తీవ్రమైంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకులుగా పేరుపొందిన బ్యాంక్ సెంట్రల్ ఆసియా, బ్యాంక్ రక్యాత్ ఇండోనేషియా, బ్యాంక్ మందిరి షేర్లు ఒకేరోజు 15 శాతం వరకు నష్టపోయాయి. ఈ ఘోర పతనంతో ఈ ఏడాది జకార్తా మార్కెట్ మొత్తం 40 శాతం మేర నష్టపోయి, ప్రపంచంలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన స్టాక్ మార్కెట్‌గా రికార్డులకెక్కింది. దీనికి తోడు ఇండోనేషియా కరెన్సీ రూపియా కూడా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 18,070 స్థాయికి పడిపోయింది.
స్టాండ్అలోన్ కేటగిరీ ముప్పు, ఆర్థిక పరిణామాలు
ఎమ్ఎస్సీఐ వర్గీకరణలో స్టాండ్అలోన్ హోదా అనేది అత్యంత దిగువ స్థాయిగా పరిగణింపబడుతుంది. ఇప్పటివరకు ఫ్రంటియర్ కేటగిరీకి మారుస్తారని భావించినప్పటికీ, నేరుగా స్టాండ్అలోన్ దిశగా అడుగులు వేయడం అంతర్జాతీయ పెట్టుబడిదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఇండోనేషియా సరసన అర్జెంటీనా, లెబనాన్, పాలస్తీనా, ఉక్రెయిన్ వంటి దేశాలు చేరుతాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ కేటగిరీలోకి వెళ్లే ఏకైక మార్కెట్‌గా ఇండోనేషియా నిలుస్తుంది. గ్లోబల్ పాసివ్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ పెట్టుబడులు బయటకు తరలిపోయే ప్రమాదం ఏర్పడటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆసియాలోని ఇతర మార్కెట్ల పరిస్థితి
ఇండోనేషియా మార్కెట్ రక్తం ఓడుతున్న వేళ ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. దక్షణ కొరియా కోస్పి ఇండెక్స్ గత సెషన్ కనిష్ట స్థాయి నుంచి స్వల్పంగా కోలుకున్నప్పటికీ, ఏఐ రంగానికి చెందిన భయాల వల్ల ఆరు నెలల కనిష్ట స్థాయి వద్దే ముగిసింది. తైవాన్ షేర్లు నిన్నటి భారీ పతనం తర్వాత స్వల్ప లాభాలను ఆర్జించాయి. సింగపూర్ మార్కెట్ 0.8 శాతం లాభపడగా, ఫిలిప్పీన్స్ స్టాక్ మార్కెట్ 2 శాతానికి పైగా పుంజుకుంది. మరోవైపు మలేషియా షేర్లు 0.7 శాతం నష్టపోయాయి. థాయిలాండ్ మార్కెట్ సెలవు దినం కావడంతో మూసివేసి ఉంది.

