Inflation : భారతదేశంలో సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడేలా ధరల మంట మళ్లీ మొదలైంది. జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగి 4.38 శాతానికి చేరుకుంది. జాతీయ గణాంక కార్యాలయం (MoSPI) విడుదల చేసిన ఈ తాజా డేటా ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే గత 17 నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్దేశించుకున్న 4 శాతం సురక్షిత పరిమితిని దాటడం ఇదే తొలిసారి. మే నెలలో ఈ ద్రవ్యోల్బణ రేటు 3.93 శాతంగా నమోదవ్వగా.. కేవలం నెల రోజుల్లోనే ఇది భారీగా పెరిగింది. వినియోగదారుల ధరల సూచీ కోసం కొత్త బేస్ ఇయర్‌ను సవరించిన తర్వాత ఇదే అత్యధిక ద్రవ్యోల్బణ రేటు కావడం గమనార్హం.

కూరగాయలు, నిత్యావసరాల ధరలతో వంటగది బడ్జెట్ అస్తవ్యస్తం

ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు చుక్కలు చూపించడమే. జూన్ నెలలో ఆహార ద్రవ్యోల్బణ రేటు 5.32 శాతానికి పెరిగింది. ఇది మే నెలలో కేవలం 4.78 శాతంగా ఉంది. ఈ పెరుగుదలను పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 5.45 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 5.09 శాతంగా నమోదైంది. అయితే ఆలుగడ్డలు (20.34 శాతం డౌన్), టమాటా (31.92 శాతం డౌన్) వంటి కొన్ని కూరగాయల ధరలు తగ్గినప్పటికీ.. మిగిలిన నిత్యావసర వస్తువులు, పప్పు ధాన్యాలు, నూనెల ధరలు విపరీతంగా పెరగడంతో ఆ ఉపశమనం కాస్తా నీరుగారిపోయింది.

పెట్రోల్, డీజిల్ రేట్ల ఎఫెక్ట్.. రవాణా ఖరీదైతే అన్నీ ప్రియమే

కేవలం వంటగది బడ్జెట్ మాత్రమే కాదు.. సామాన్యుల ప్రయాణాలు, సరుకుల రవాణా కూడా ఖరీదైనవిగా మారాయి. జూన్ నెలలో రవాణా ద్రవ్యోల్బణం 4.31 శాతానికి పెరిగింది. మే నెలలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు సార్లు పెంచడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా వస్తువుల రవాణా సేవల ద్రవ్యోల్బణ రేటు ఏకంగా 7.70 శాతానికి ఎగబాకింది. రవాణా ఛార్జీలు పెరిగితే ఫ్యాక్టరీల నుంచి మార్కెట్లకు వచ్చే ప్రతి నిత్యావసర వస్తువు ధర ఆటోమేటిక్‌గా పెరిగిపోతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ముడిచమురు సెగతో మున్ముందు మరింత ముప్పు

రాబోయే రోజుల్లో కూడా ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం అంత సులువు కాదని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో వర్షపాతం తగ్గి, వర్షాకాలం బలహీనపడితే పంటల దిగుబడి ఘోరంగా దెబ్బతింటుంది. భారతదేశంలో సగానికి పైగా వ్యవసాయ సాగు నీటి పారుదల వర్షాలపైనే ఆధారపడి ఉంది కాబట్టి దీని ప్రభావం ఆహార సరఫరాపై పడుతుంది. మరోవైపు, పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశమైన భారత్‌కు ఇది పెద్ద ఆర్థిక భారంగా మారి, రూపాయి బలహీనపడటానికి దారితీస్తుంది.

ఈ దెబ్బతో మీ బ్యాంక్ లోన్ల ఈఎంఐలు మరింత పెరగనున్నాయా?

ఆర్‌బీఐ ఏప్రిల్ 2026 నుంచి మార్చి 2031 వరకు ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (2 నుంచి 6 శాతం పరిమితిలో) ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో.. జూన్ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ తన రెపో రేటును 5.25 శాతంగానే యథాతథంగా ఉంచింది. అంతేకాకుండా ఆహార, ఇంధన ధరల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాలను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఉపాసన భరద్వాజ్ విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్‌బీఐ తన వడ్డీ రేట్లను 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) పెంచే అవకాశం ఉంది. దీనివల్ల ఇళ్ల లోన్లు, కార్ లోన్ల ఈఎంఐలు మరింత ఖరీదు కానున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story