ఫిబ్రవరిలో 3.21 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం

Inflation : సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే వార్త ఇది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్ళీ పడగ విప్పింది. జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో ధరల పెరుగుదల రేటు 3.21 శాతానికి చేరింది. ప్రధానంగా నిత్యావసర వస్తువులు, తినుబండారాలు, దుస్తులు, ఇంటి అద్దెల ధరలు పెరగడమే ఇందుకు కారణమని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. అయితే, ప్రభుత్వం ద్రవ్యోల్బణ సూచీని లెక్కించే పద్ధతిని మార్చడం వల్ల పాత గణాంకాలతో వీటిని పోల్చడం కష్టంగా మారింది. ఇప్పుడు 2024ను బేస్ ఇయర్‌గా తీసుకుని కొత్త సిరీస్‌లో ఈ లెక్కలను ప్రకటిస్తున్నారు.

నిజానికి జనవరిలో ద్రవ్యోల్బణం 2.75 శాతంగా ఉండేది. కానీ కేవలం నెల రోజుల్లోనే ఇది 3.21 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 2.13 శాతం ఉండగా, ఫిబ్రవరిలో అది ఏకంగా 3.47 శాతానికి పెరిగింది. ఒకవైపు పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, రాబోయే రోజుల్లో ధరలు మరింత ప్రియం అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా ధరల సెగ తగులుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2.73 శాతం నుంచి 3.37 శాతానికి పెరగగా, పట్టణాల్లో ఇది 3.02 శాతంగా నమోదైంది. అయితే, ఊరట కలిగించే విషయం ఏంటంటే.. ఈ పెరిగిన ధరలు కూడా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన 4 శాతం పరిమితి లోపే ఉండటం విశేషం. వంటగదిలో వాడే వెల్లుల్లి, ఉల్లిపాయలు, బంగాళదుంపల ధరలు మాత్రం గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. వెల్లుల్లి ధరలు ఏకంగా 31 శాతం తగ్గడం సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చే అంశం.

కేవలం తిండి గింజలే కాదు, ఇతర సేవలు కూడా ఖరీదయ్యాయి. ఇంటి అద్దెలు 2.12 శాతానికి పెరగగా, సమాచార, కమ్యూనికేషన్ సేవల ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కానీ, అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే బంగారం, వెండి ధరల బాదుడు. వెండి ఆభరణాల ధరలు ఏకంగా 160 శాతం పెరగడం గమనార్హం. బంగారం, వజ్రాలు, ప్లాటినం ధరలు కూడా 48 శాతానికి పైగా ఎగబాకాయి. యుద్ధ భయంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లు మళ్లడమే దీనికి కారణం.

మొత్తానికి యుద్ధ నీడలు, చమురు కష్టాల మధ్య భారత్‌లో ద్రవ్యోల్బణం మళ్ళీ నెమ్మదిగా పెరుగుతోంది. గ్యాస్, విద్యుత్ వంటి ఇంధన ధరలు ప్రస్తుతం 0.14 శాతం వద్ద నిలకడగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా పరిస్థితులు మారితే ఇవి కూడా పెరిగే ప్రమాదం ఉంది. రాబోయే నెలల్లో ఆర్‌బీఐ తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయంపై ఈ గణాంకాలు గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story