Infosys : బీటెక్ అయిపోగానే రూ.21లక్షలా? ఇది కలా నిజమా? నిరుద్యోగులకి ఇన్ఫోసిస్ అదిరిపోయే గిఫ్ట్
నిరుద్యోగులకి ఇన్ఫోసిస్ అదిరిపోయే గిఫ్ట్

Infosys : సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెట్టాలని చూస్తున్న యువతకు భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సాధారణంగా ఫ్రెషర్లకు తక్కువ జీతాలు ఇస్తారనే పేరున్న ఐటీ రంగంలో, ఇప్పుడు ఇన్ఫోసిస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎంట్రీ లెవల్‌లోనే ఏకంగా రూ.21లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని ఆకర్షించేందుకు, ముఖ్యంగా ఏఐ, డిజిటల్ స్పెషలైజ్డ్ రోల్స్ కోసం ఇన్ఫోసిస్ ఈ భారీ నిర్ణయం తీసుకుంది.
ఏయే పోస్టులకి ఎంత జీతం?
సాధారణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే భిన్నంగా, టెక్నాలజీలో స్పెషలైజేషన్ ఉన్న విద్యార్థుల కోసం ఇన్ఫోసిస్ నాలుగు రకాల ప్యాకేజీలను సిద్ధం చేసింది. వీటిలో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్3 హోదాలో చేరే ట్రైనీలకు ఏకంగా రూ.21 లక్షల ప్యాకేజీ లభిస్తుంది. అలాగే ఎల్2 ట్రైనీలకు రూ.16 లక్షలు, ఎల్1 ట్రైనీలకు రూ.11 లక్షలు, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్లకు రూ.7లక్షల చొప్పున జీతాలను ఖరారు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఏ ఇతర ఐటీ కంపెనీ కూడా ఎంట్రీ లెవల్‌లో ఈ స్థాయి ప్యాకేజీలను అందించడం లేదు.
ఆఫ్-క్యాంపస్ ద్వారా నియామకాలు
సాధారణంగా ఐటీ కంపెనీలు కాలేజీలకు వెళ్లి క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంచుకుంటాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్ ఈసారి ఆఫ్-క్యాంపస్ నియామకాలపై దృష్టి సారించింది. అంటే కాలేజీలతో సంబంధం లేకుండా నేరుగా టాలెంట్ ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరీక్షల ద్వారా ఎంపిక చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025-26) మొత్తం 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 12,000 మందిని తీసుకోగా, మార్చి 31లోపు మరో 8,000 మందిని నియమించనుంది.
ఐటీ రంగంలో పెరిగిన అంతరాలు
ఐటీ రంగంలో గత పదేళ్ల గణాంకాలను చూస్తే ఒక వింత పరిస్థితి కనిపిస్తుంది. కంపెనీ సీఈఓల జీతాలు పదింతలు పెరిగితే, కింది స్థాయి ఉద్యోగుల జీతాలు మాత్రం కేవలం 45 శాతమే పెరిగాయి. 2012లో ఫ్రెషర్లకు సగటున రూ.2.45 లక్షలు ఉంటే, 2022 నాటికి అది రూ.3.55 లక్షలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి కంపెనీలు జీతాలు పెంచుతున్నప్పటికీ, ఇన్ఫోసిస్ ఏకంగా రూ.21 లక్షల ఆఫర్ ప్రకటించడంతో మార్కెట్లో కొత్త పోటీ మొదలైంది. ఏఐ అప్లికేషన్లు పెరగడం, డిజిటల్ టాలెంట్ అవసరం ఉండటంతోనే కంపెనీ ఇంత భారీగా ఖర్చు చేయడానికి సిద్ధపడింది.

