Infosys : 70 గంటల పని కాదు.. ఇప్పుడు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమంటున్న ఇన్ఫోసిస్
ఇప్పుడు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమంటున్న ఇన్ఫోసిస్

Infosys : ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలి అని కొద్ది నెలల క్రితం పెద్ద చర్చకు తెరలేపారు. కానీ ఇప్పుడు ఆయన స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీ అందుకు భిన్నంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేయకూడదని, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని (వర్క్-లైఫ్ బ్యాలెన్స్) గట్టిగా చెబుతోంది. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా ఇమెయిల్స్ పంపింది. రోజూ 9 గంటల 15 నిమిషాల కంటే ఎక్కువ పని చేయకూడదని, లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించింది. ఒకవేళ ఎవరైనా ఎక్కువ పని చేస్తే, కంపెనీకి ఆటోమేటిక్‌గా హెచ్చరిక వెళ్లే సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. గత నెలలో పని గంటలు ఎక్కువైతే, కంపెనీ మళ్ళీ ప్రత్యేకంగా ఇమెయిల్స్ పంపి ఉద్యోగులను అప్రమత్తం చేస్తోంది.
ఈ మధ్య యువ ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేయడం వల్ల గుండెపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే వార్తలు ఎక్కువయ్యాయి. ఈ ప్రమాదాలను తగ్గించడానికి, ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యమని భావించి ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. "దేశ అభివృద్ధికి యువత వారానికి 70 గంటలు పని చేయాలి" అన్న నారాయణ మూర్తి మాటలు పెద్ద చర్చకు దారితీశాయి. తర్వాత ఆయన తన మాటలను సమర్థించుకుంటూ, కష్టపడి, అంకితభావంతో పని చేయాలని మాత్రమే తన ఉద్దేశమని చెప్పారు. అయితే, ఇప్పుడు ఆయన స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీ మాత్రం ఉద్యోగుల ఆరోగ్యం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ కొత్త విధానాన్ని తీసుకురావడం గమనార్హం.
బెంగుళూరు కేంద్రంగా పనిచేసే ఇన్ఫోసిస్‌లో దాదాపు 3.23 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త నిబంధనలు ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, వారి పని సామర్థ్యాన్ని కూడా పెంచుతాయని కంపెనీ ఆశిస్తోంది. ఎక్కువ గంటలు పని చేయకుండా, సరైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పాటిస్తే ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పని చేయగలరని ఇన్ఫోసిస్ నమ్ముతోంది.
